పామాయిల్​ రిఫైనరీ ఏర్పాటు చేస్తాం : మంత్రి తుమ్మల

 పామాయిల్​ రిఫైనరీ ఏర్పాటు చేస్తాం : మంత్రి తుమ్మల
  • అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో మంత్రి తుమ్మల 

అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ రైతులు కోరుతున్నట్లు రిఫైనరీ ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దివంగత నందమూరి తారక రామారావు 1989 ఇచ్చిన వరమే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అని చెప్పారు.  శనివారం అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివినవారు  ఆయా దేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు.  35 ఏండ్లుగా 2,500 మంది కీర్తి తెచ్చుకున్నారన్నారు. కళాశాలలో ఉన్న 295 ఎకరాల్లో ఈ దేశంలో పండే అన్ని పంటలను పండించాలన్నారు. 

వికారాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ తోటలో మునగ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 240 జూనియర్ లెక్చరర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కాగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యవసాయ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో  ‘పచ్చని చెట్టును నేను రా..’ అనే పాటను పాడి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్​వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్​లర్​ డాక్టర్ పి రాజిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జె.సత్యనారాయణ, ఆయిల్​ఫెడ్​ జనరల్ మేనేజర్ పి. సుధాకర్ రెడ్డి, డీఎస్పీ సతీశ్​కుమార్  దమ్మపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ వాసం రాణి, నాయకులు బండి పుల్లారావు, చెన్నకేశవరావు, పైడి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పుల్లారావు, అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

సూపుకుంట గ్రామంలో మంత్రి పర్యటన 

దమ్మపేట : దమ్మపేట మండలంలోని పూసుకుంటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. గ్రామంలోని కొండరెడ్ల గిరిజనులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆదివాసీలు ఆర్థికంగా బలపడటానికి ఆధునిక వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించి ఆయిల్ పామ్ మొక్కలు అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి నీటి వసతి కోసం ఐటీడీఏ ద్వారా ఉచితంగా బోర్లు మోటార్లు, సోలార్  సిస్టం ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.30 కోట్లతో గ్రామానికి బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

11 వేల టీచర్​పోస్టులు భర్తీ చేశాం..

సత్తుపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల టీచర్​ పోస్టులు భర్తీ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీజీ యూటీఎఫ్ 6వ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించామని తెలిపారు.  అంతకుముందు స్థానిక జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయ కొత్త భవనాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.  పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.