- ప్రభుత్వం తరఫున అన్ని రకాలా సహకరిస్తం: మంత్రి తుమ్మల
- అగ్రికల్చర్ అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీలతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: గత ఐదేండ్లుగా అగ్రికల్చర్ అనుబంధ కార్పొరేషన్లన్నీ కుంటుపడ్డాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాటన్నింటినీ గాడిలో పెట్టి.. తిరిగి వాటికి పూర్వవైభవం తెచ్చేదిశగా చైర్మన్లు, ఎండీలు కృషి చేయాలని ఆయన సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో అగ్రికల్చర్ అనుబంధ కార్పొరేషన్లు, చేనేత కార్పొరేషన్ల చైర్మన్ లు, ఎండీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్న, నేతన్నల సంక్షేమం మనందరి బాధ్యత అని, ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రైతుల వద్ద మద్ధతు ధరకు సేకరించిన జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, కందిపంటలను అనుకూల మార్కెట్ ధరలకు విక్రయించాలని మార్క్ఫెడ్ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి సూచించారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని జనవరి- 25 కల్లా పూర్తి చేయాలని ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషాను మంత్రి తుమ్మల ఆదేశించారు.
సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ఈ–కామర్స్, చేనేత లక్ష్మి వంటి కార్యక్రమాలపై ప్రజలలో విస్తృత ప్రచారం చేసి, టెస్కో ద్వారా అమ్మకాలు పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని టెస్కో ఎండీకి సూచించారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు తగిన ప్రచారం కల్పించి, ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం పలువురు కార్పొరేషన్ల ఎండీలు సంస్థలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అగ్రికల్చర్ సెక్రటరి రఘునందన్ రావు, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, రాయల్ నాగేశ్వరరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్బాలరాజు, ఆగ్రోస్ ఎండీ కె రాములు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.