- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- దేశానికి వెన్నెముక రైతు
- ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హాలియా, వెలుగు: రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్, నిడమనూరు మండల కేంద్రంలోని బాలజీ ఫంక్షన్‌హాల్ లో హాలియా, నిడమనూరు వ్యవసాయ మార్కెట్కమిటీల నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. హాలియా మార్కెట్అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అని, అలాంటి రైతుకు సేవ చేసే అవకాశం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు వచ్చిందన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేసి రైతులకు సేవ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పుకు ప్రభుత్వం వడ్డీ కడుతూనే ముందుకు సాగుతున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 15, 20 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేవారని, కాంగ్రెస్అధికారంలోకి రాగానే ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని తెలిపారు.
రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. నాగార్జునసాగర్ కు అవసరమైతే కేటాయించినదానికంటే అదనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ హాలియా మార్కెట్ కమిటీకి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా మార్కెట్ కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన హాలియా మార్కెట్ చైర్మన్ గా తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ చంద్ర శేఖర్, నిడమనూరు చైర్మన్‌గా అంకతి సత్యం, వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు డైరెక్టర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు మంత్రులు పెద్దవూర మండలం పెద్దగూడెం స్టేజి వద్ద రూ.11 కోట్లతో పెద్దవూర నుంచి మిర్యాలగూడ వయా అన్నారం వరకు నిర్మించనున్న 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
పెద్దవూర మండలం పెద్దగూడెం స్టేజీ వద్ద, ముసలమ్మ చెట్టు స్టేజ్ వద్ద రూ.25 కోట్లతో నిర్మించనున్న 11 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, నారాయణగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.