ఆయిల్‌ పామ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్‌ పామ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు
  •     ఐదేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఈ తోటలు సాగు చేయాలి 
  •     టన్నుకు రూ.15వేలు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
  •     వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : -ఆయిల్‌ పామ్‌ తోటల సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ సాగుతో రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుందని, దాంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని హైదరాబాద్ ​మినహా అన్ని జిల్లాలూ ఆయిల్​ పామ్​ తోటలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. 

రాబోయే ఐదేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఈ తోటలు సాగు చేయాలని కోరారు. శుక్రవారం దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆయిల్​ఫేడ్​మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యాశ్మీన్ బాషతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

దేశంలో ఆయిల్ 100 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే, ప్రస్తుతం దేశంలో 3.96 లక్షల టన్నులు మాత్రమే వస్తుందని, దీంతో ఎప్పటికీ పామాయిల్ పంటకు డిమాండ్ తగ్గదని చెప్పారు. రైతులు ఇతర పంటల నుంచి పామాయిల్ సాగుకు మారడం వల్ల అంతర్ పంటల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ టన్నుకు రూ. 15వేలు తగ్గకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎక్కువగా గిరిజన ప్రాంతం అయినందున ఇక్కడ ధరణిలో ఏమైనా పొరపాట్లు ఉన్నా..  కాస్తులో ఉన్న రైతుకు మొక్కలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆయిల్ రికవరీ శాతంలో దేశం మొత్తానికి అప్పారావుపేట బెంజ్ మార్క్ కావాలని కోరారు. సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామం వద్ద పనులు జరుగుతున్నాయని, కొద్ది కాలంలోనే అంకమ్మ చెరువుకు గోదావరి జలాలను తీసుకొస్తామని చెప్పారు. 

ఉద్యానవన పంటలకు ఈ ప్రాంతం నెలవు

అశ్వారావుపేట నియోజకవర్గం ఉద్యానవన పంటలకు నెలవని, రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి పంటలను పరిశీలించేందుకు రైతులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు.  ఆర్ఓఆర్, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా పామాయిల్ మొక్కలు అందించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఆయిల్​ ఫేడ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ యాశ్మీన్ బాష మాట్లాడుతూ ఉద్యానవన పంటలకు నిలయంగా ఉన్నా ఈ ప్రాంతంలో హార్టికల్చర్ కాలేజ్ ఏర్పాటుకు ప్రపోజల్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.