రైతు భరోసాపై కేబినెట్ దే తుది నిర్ణయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతు భరోసాపై కేబినెట్ దే తుది నిర్ణయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు : రైతు భరోసా అంశంపై కేబినెట్ దే తుది నిర్ణయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా సీతానగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, రూ.7,625 వేల కోట్ల రైతు బంధు, రూ.3 వేల కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు తెలిపారు.

గతంలో ఆగిపోయిన అన్ని పథకాలు పునరుద్ధరణ చేసినట్లు పేర్కొన్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చామని, మిగిలిన అన్ని పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేశామని తెలిపారు. పంట వేసిన ప్రతి రైతుకూ ఎలాంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేదే వ్యవసాయ శాఖ మంత్రిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు.  

కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేసిందని, ఎలాంటి చర్చలు చేసినా పంట వేసిన ప్రతి రైతుకూ రైతు భరోసా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ రోజు వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.