11 నెలల్లో రైతుల ఖాతాల్లో 30 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల

ఖమ్మం, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే వివిధ పథకాల కింద రూ.30 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతుబంధు, సగం చేసి వదిలేసిన రుణమాఫీతో పాటు రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద బకాయి పెట్టిన రూ.7 వేల కోట్లను తమ ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం అందజేశామని పేర్కొన్నారు. 

సోమవారం ఖమ్మంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. దేశంలో తెలంగాణ తప్ప ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన రాష్ట్రమేదీ లేదన్నారు. ఇక రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి త్వరలోనే షెడ్యూల్ రిలీజ్​చేస్తామని, ఆ రుణం చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకర్లకు జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు.  పంట బీమా పథకం ప్రీమియంను కూడా రైతుల పక్షాన ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈనెల 15 లేదా 16న పంట టెండర్లు పిలుస్తామన్నారు. 

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పంట బీమా పథకం అమలు చేస్తామన్నారు. రుణమాఫీ, వడ్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను ఆగం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐతో మాట్లాడి గంటల్లోనే సమస్యను పరిష్కరించామని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్ ​రాయల నాగేశ్వరరావు ఉన్నారు.