రూ.655 కోట్లతో 6 నేషనల్​ హైవేలు మంజూరు

రూ.655 కోట్లతో 6 నేషనల్​ హైవేలు మంజూరు
  •     వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.655 కోట్లతో ఈ సంవత్సరం నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆరు జాతీయ రహదారులను మంజూరు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలోని తన క్యాంప్​ ఆఫీస్​ లో తుమ్మల మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా స్వయంగా కేంద్ర మంత్రుల దగ్గర లిస్ట్ పెట్టి గతంలో ఉన్న ప్రతిపాదనలను, కొత్త ప్రతిపాదనలను కలిపి మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. 

ఉమ్మడి జిల్లాకు కొత్తగా మంజూరైన ఆరు జాతీయ రహదారులు గతంలో తాను ఆర్​ అండ్​ బీ మంత్రిగా ఉన్న సమయంలో  ప్రతిపాదించానని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచకు 25 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు కోసం రూ.450 కోట్లు, ఎన్ హెచ్ 365ఏ, ఎన్ హెచ్ 163జి మధ్య 6.5 కిలోమీటర్ల మేర మిస్సింగ్ లింక్ కలపడానికి రూ.125 కోట్లు, భద్రాచలం పట్టణంలో ఎన్​హెచ్30 అభివృద్ధి కోసం 7 కిలోమీటర్ల మేర రూ.50 కోట్లు, కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.2.64 కోట్లు, కొత్తగూడెంలోని కిన్నెరసాని పాత బ్రిడ్జి పక్కన కొత్త బ్రిడ్జి కోసం రూ.20.22 కోట్లు, ఖమ్మంలో కోదాడ జంక్షన్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు రూ.7 కోట్లు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.654.86 కోట్ల పనుల కోసం ఆమోదముద్ర పడిందన్నారు. రానున్న మూడు నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్​) తయారుచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. 

మరికొన్ని ప్రపోజల్స్​ పెండింగ్ లో... 

మరికొన్ని ప్రపోజల్స్​ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా మంజూరు చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. సారపాక నుంచి ఏటూరు నాగారం వరకు 93 కిలోమీటర్లు, జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు 100 కిలోమీటర్లు, సారపాక నుంచి వయా రేచర్ల, ములకలపల్లి వరకు 100 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. 

కొత్తగా ఖమ్మం నగరం సమీపంలోని నాయుడుపేట నుంచి రాపర్తి నగర్ వరకు రెండు బ్రిడ్జిల కోసం రూ.80 కోట్లు, ఎన్టీఆర్​ సర్కిల్​ దగ్గర ఫ్లై ఓవర్​ కోసం రూ.40 కోట్లు, శ్రీశ్రీ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్​ కోసం రూ.40 కోట్లతో ప్రపోజల్స్​ పెట్టామని వివరించారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.