గ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్​ ఆఫీసర్​ బాబూరావు

గ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్​ ఆఫీసర్​ బాబూరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామాల్లో తిరిగి  నాసిరకం విత్తనాలు అమ్మితే వారిపై చీటింగ్​ కేసు నమోదు చేస్తామని జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ బాబూరావు మంగళవారం హెచ్చరించారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తున్నాయంటూ లైసెన్స్​ లేకుండా అమ్మే విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. జిల్లాలో రెండు టాస్క్​ ఫోర్స్​ టీమ్స్​ ఏర్పాటు చేశామన్నారు. 

ప్రత్యేక నిఘా : ఎస్పీనాసిరకం విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ బి. రోహిత్​ రాజు మంగళవారం తెలిపారు. అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా నాసిరకం విత్తనాలను కొందరు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్​ స్టేషన్ల పరిధిలో విత్తన దుకాణాల్లో తనిఖీలు చేయనున్నట్టు తెలిపారు.

డీఎస్పీ సమావేశం.. 

జూలూరుపాడు : జూలూరుపాడు మండల కేంద్రంలోని ఏవీఆర్​ ఫంక్షన్​ హాల్​ లో ఫెర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ షాపు యజమానులతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్​ రెహమాన్ మంగళవారం  సమావేశం ఏర్పాటు చేశారు. నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. 

అశ్వారావుపేట : అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో పురుగు మందుల షాపు యజమానులతో సీఐ జితేందర్ రెడ్డి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. లైసెన్సులు లేకుండా రైతులకు విత్తనాలు అమ్మొద్దని ఆయన 
సూచించారు. 

గుండాల  : ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్స్ అమ్మే వ్యాపారస్తులు నాసిరకం విత్తనాలు తెచ్చి రైతులను మోసం చేస్తే యాక్షన్ తప్పదని సీఐ రవీందర్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యాపారస్తులను పిలిపించి మాట్లాడి పలు నిబంధనలను వివరించారు. 

అశ్వాపురం : అశ్వాపురం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వాపురం పోలీస్ స్టేషన్​లో విత్తన డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీటింగ్​లో ఆయన  మాట్లాడుతూ రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు.