- ఉమ్మడి జిల్లాలో వరి 12.65 లక్షలు, పత్తి 8.07 లక్షల ఎకరాలు
- వచ్చే వారంలో రైతులకు అవగాహన
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : వాణిజ్య పంట పత్తితోపాటు పప్పు ధాన్యాల సాగు పెంపుపై అగ్రికల్చర్ఆఫీసర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాగు పెంపుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి12.65 లక్షలు, పత్తి 8.07 లక్షలు పండించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. యాదాద్రి జిల్లాలో పత్తి సాగు 2,01,6-17 నుంచి 2,02,0-21 వరకు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కూలీల సమస్యతోపాటు అమ్మకంవిషయంలో ఇబ్బందులు తలెత్తుండడంతో పత్తి సాగు నుంచి ఎక్కువ మంది రైతులు తప్పుకోవడంతో 2023 వానాకాలంలో 1.02 లక్షల ఎకరాలకే పరిమతమైంది.
పత్తి సాగు నుంచి రైతులు వరి వైపునకు మొగ్గు చూపారు. దీంతో 2,02,0-21లో 2.02 లక్షల ఎకరాల్లో సాగు చేసిన రైతులు 2023 వానాకాలం నాటికి ఏకంగా 3.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాదాద్రి జిల్లాలో ఏటా పత్తి సాగు తగ్గుతూ ఉండడంపై అగ్రికల్చర్డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. రైతులను పత్తి సాగు వైపునకు మళ్లించడంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది వానాకాలంలో 1.02 లక్షల ఎకరాలు సాగు, ఈ సీజన్లో 33 వేల ఎకరాల సాగు పెంపు లక్ష్యంగా నిర్ణయించుకుంది.
యాదాద్రిలో 4,28,850 ఎకరాల్లో సాగు..
యాదాద్రి జిల్లాలో వానాకాలంలో అన్ని పంటలు కలిపి 4,28,850 ఎకరాల్లో సాగు చేయనున్నారని ప్లానింగ్‌లో పేర్కొన్నారు. ఈ సీజన్ లో 2.85 లక్షల ఎకరాల్లో వరి, 1.35 లక్షల ఎకరాల్లో పత్తి, 8,500 ఎకరాల్లో కంది, పెసర్లు, ఇతర పంటలు 350 ఎకరాల్లో సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వానాకాలంలో 8,0594 టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. వరికి 71,250 క్వింటాళ్ల విత్తనాలు, పత్తికి 2.70 లక్షల ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు.
సూర్యాపేటలో 6,34,400 ఎకరాలు..
సూర్యాపేట జిల్లాలో వానాకాలం సాగు అంచనాలను జిల్లా వ్యవసాయశాఖ ఖరారు చేసింది. జిల్లాలో 6,34,400 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతాంగం సాగు చేయనుందని అంచనా వేసింది. వరి 4,65,500 లక్షల ఎకరాలు, పత్తి 1,12,500 ఎకరాలు, మిరప 22వేల ఎకరాలు, జొన్న 75 ఎకరాలు, వేరుశనగ 1250 ఎకరాలు, ఇతర పంటలు 1200 ఎకరాలు వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. వాణిజ్య పంట అయిన పత్తికి, పప్పు దినుసులకు మంచి డిమాండ్ ఉండడంతో గతేడాది 88 వేల ఎకరాల్లో సాగు అయిన పత్తిని ఈసారి 1,12,500 ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు.
నల్గొండ జిల్లాలో 10.70 లక్షల ఎకరాలు..
నల్గొండ జిల్లాలో వరి5.10 లక్షల ఎకరాలు సాగువుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంట్లో సుమారు రెండున్నర లక్షల ఎకరాలు సన్నాలు సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. పత్తి 5.60 లక్షలు సాగవుతుందని అంచనా వేశారు. వరికి బోనస్ ప్రకటించడంతో ఈసారి సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.