తెలంగాణలో సంపూర్ణ వ్యవసాయ విధానం అవసరం

తెలంగాణలో సంపూర్ణ వ్యవసాయ విధానం అవసరం

తెలంగాణ  ప్రభుత్వం  గతంలో  తెలిపిన గణాంకాల ప్రకారం వ్యవసాయం రంగం ఇతోధిక వృద్ధి సాధించింది. ఆ లెక్కల ప్రకారం వరి ఉత్పత్తి 2015-16లో 45.71 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22 నాటికి 202 లక్షల టన్నులకు పెరిగింది. అదేవిధంగా, 2015-16లో  పత్తి 18.85 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22 నాటికి 25.08 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అట్లాగే  గొర్రెల సంఖ్య పెరిగిందని, 2021-22లో దేశంలో  గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉన్నామని ప్రకటించింది. 

ప్రధానంగా 2014-15లో  స్థూల సాగుభూమి 62.48 లక్షల ఎకరాల నుంచి 2021–22 నాటికి 135 లక్షల ఎకరాలకు పెరిగింది.  వివిధ రూపాలలో కనిపిస్తున్న ఈ పెరుగుదల నిజమేనా?  ఎట్లా సాధ్యమయ్యింది?  గత ప్రభుత్వం  వెల్లడించలేదు.  లక్షల ఎకరాల భూమి కొత్తగా సాగులోకి ఎట్లా వచ్చింది?   ఇటువంటి  వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి వచ్చినాయి?  నిధుల మాట ఎట్లా ఉన్నా,  ఈ రకమైన వృద్ధి వల్ల  రైతులు సంతోషంగా ఉన్నారా?   రైతులు సంతోషంగా ఉంటే  రైతుబంధు,  రైతు రుణమాఫీ పథకాల అవసరం మళ్లీ మళ్లీ ఎందుకు ఏర్పడుతోంది?

రైతులపై పెట్టుబడి భారం

117 శాతం పెరిగినట్లు భావిస్తున్న సాగు భూమి విస్తీర్ణానికి అవసరమైన నిధులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు.  ఎకరాకు రూ.50 వేల చొప్పున 2014-–15లో  రూ.31,240 కోట్ల పెట్టుబడి అయితే,  2021-22 నాటికి అదే ఎకరా రూ.50 వేల పెట్టుబడి చొప్పున మొత్తం రూ.67,500 కోట్ల పెట్టుబడి అయింది.  సామాన్య రైతులే అప్పు చేసి, సొమ్ములు, భూమి, ఆస్తులు తాకట్టు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టిండ్రు. పంటలు, పాడి పశువులు, గొర్రెలు, చేపలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.76,123 కోట్లు ఉంటే, 2022-23 నాటికి  రూ.2,17,877 కోట్లకు పెరిగింది అని ప్రభుత్వ నివేదిక చెబుతున్నది.  

పెట్టుబడులు పోను, 2014-15లో  రూ.44,883 కోట్ల నుంచి 2021-22 నాటికి పెరిగిన రూ.1,50,377 కోట్ల మిగులు రైతుల జేబులోకి వచ్చిందా?  మరి ఈ సంపద ఎక్కడకు పోయింది?  ఈ ఉత్పత్తులలో  కేవలం పంటల విలువ 2014-15లో  రూ.41,706 కోట్ల నుంచి 2022-23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.98,478 కోట్లకు పెరిగింది.  రైతులు, పశువుల, చేపల పెంపకందారులు వంటి వర్గాల ఆదాయం పెరగడం లేదు. ఆయా రంగాలలో ప్రభుత్వం ఇచ్చిన వృద్ధి లెక్కలలో వాస్తవం ఎంత ఉన్నా, ఆ వృద్ధి వల్ల లబ్ధి వారికి చేకూరడం లేదు. 

పథకాలు ప్రకటించి చేతులు దులుపుకుంటే..?

రైతు సమస్యలను తీర్చే వ్యవస్థగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిణతి సాధించలేదు.  వ్యవసాయ భూమి సంక్షోభంలో పడింది.  ధరణి వల్ల రైతుల భూమి గోస పెరిగింది.  పట్టా పుస్తకాలలో ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రైతులకు తమ భూమి పట్ల ఆందోళన అధికమయ్యింది. భూమి వ్యవసాయం వైపు మల్లుతున్న పరిస్థితులు ఒక వైపు ఉండగా,  వ్యవసాయ భూమి ఇండ్ల ప్లాట్లకు ఇంకొకవైపు మల్లుతున్నది.  వ్యవసాయ భూముల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించాల్సిన తీవ్రమైన పరిస్థితి ఉన్నది.  ఏదో ఒక బృహత్ పథకం ప్రకటించి చేతులు దులుపుకుంటే ఫలితం ఉండదు. సగటున ఎకరా పంటకు రూ.50 వేలు ఖర్చు అయితున్నది.  రైతు బంధు పథకం వల్ల వచ్చేది గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే. రుణమాఫీ పథకం వల్ల బ్యాంకులు లబ్ధి పొందుతున్నాయి.  రైతుల పెట్టుబడి ఖర్చు పెరగడానికి కారణమైన రసాయనాలు,  విత్తనాలు, ఇంకా ఇతర కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి.  రైతు రుణమాఫీ వల్ల వారికి లబ్ధి  చేకూరడం చాలామందికి  తెలియదు. 

రుణాల ఊబిలో  రైతులు

తెలంగాణా ప్రభుత్వం రుణమాఫీ పథకం మీద కంటే  రైతుకు పంట ఖర్చుకు సరిపోయినంత రుణం అందిస్తే ఫలితం ఉంటుంది.  వ్యవసాయ పెట్టుబడుల మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానం రూపొందించాలి.  పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల  నష్టపోతున్న  రైతాంగానికి సత్వర  నష్టపరిహారం అందకపోవడం, నష్ట నివారణ చర్యలు కూడా లేకపోవడం  తెలంగాణా ప్రభుత్వంలో ఉన్న ఇంకొక లోపం. 

వ్యవసాయ కమిషన్​ ఏర్పాటు చేయాలి

ఉచిత విద్యుత్,  రైతుబంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలకు దారి తీసిన,  తీస్తున్న పరిస్థితులను సరిదిద్దే  చట్టాలు, విధానాలు రాష్ట్రంలో  తయారుచెయ్యాలి.  విత్తన చట్టం కావాలి.  ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన సేవలలో అవినీతిని తగ్గిస్తూ, పూర్తి నిర్మూలన వైపు కఠిన చర్యలు చేపట్టాలి. వ్యవసాయం మీద ప్రభావం చూపుతున్న ప్రకృతి విపత్తులు, కాలుష్యం వంటి  పరిణామాల మీద అధ్యయనం చేసి తగిన రక్షణ చర్యలు  చేపట్టాలి. అడవికి, పచ్చదనానికి, జీవవైవిధ్యంతో వ్యవసాయానికి ఉన్న సంబంధాలను పటిష్టం చేస్తూ, అవి పెంపొందడానికి తగిన చర్యలకు పూనుకోవాలి.  వ్యవసాయం ప్రోత్సాహానికి తగిన నిధులు,  విధులు వ్యవసాయ శాఖ పరిధిలో ఏర్పాటు చెయ్యాలి.  వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలు, సంస్థాగత వ్యవస్థను సమీక్షించి పారదర్శక పనితీరును ప్రోత్సాహించాలి.   వ్యవసాయదారులకు  భరోసాగా వ్యవసాయ  కమిషన్ ఏర్పాటు చెయ్యాలి. వ్యవసాయ చట్టాలకు పదును చెయ్యాలి.

బడ్జెట్​లో వ్యవసాయానికి తగ్గిన ప్రాధాన్యత

తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ పదేండ్లలో  ప్రతి ఏడాది పెరిగింది.  ఆయా రాబడుల పెరగడానికి కారణం అయిన వ్యవసాయ రంగానికి మాత్రం ఇచ్చింది చాలా తక్కువ. 2014-15లో  రూ.1 లక్ష కోట్ల బడ్జెట్ ఉంటే,  వ్యవసాయానికి ఇచ్చింది 7.06 శాతం మాత్రమే. 2023-24  రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షలకు పెరిగినా, వ్యవసాయానికి కేటాయింపు 7.20 శాతం మాత్రమే.   రాష్ట్ర స్థూల ఉత్పత్తుల విలువలో 18.24 శాతం ఉన్న వ్యవసాయ రంగానికి ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువ.   వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎన్నికల సందర్భంలో పెరిగి క్రమేపీ తగ్గుతున్న పరిస్థితి ఉంది. వ్యవసాయ భూమి విస్తరిస్తున్నది, పంట ఉత్పత్తి పరిమాణం పెరుగుతున్నది అని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, ఆ మేరకు వ్యవసాయ రంగ కేటాయింపులు ఎందుకు పెరగడం లేదు? ప్రతి ఏడాది, వ్యవసాయ ఉత్పత్తి విలువ పెరుగుతుంటే  ప్రభుత్వ కేటాయింపులు ఆ మేరకు పెరగడంలేదు. 

పథకాలకు టాయింపులలో  పదనిసలు 

వ్యవసాయ రంగానికి  ఇచ్చిన నిధులలో  కేవలం ఒక్క పథకానికే  రూ.15,075.00  కోట్లు ఇచ్చారు.  వ్యవసాయ శాఖ బడ్జెట్లో (2023-–24) మూడు అంకెలు దాటిన కేటాయింపులు కేవలం 4 పథకాలే.  మొత్తం వ్యవసాయ శాఖకు ప్రతిపాదించిన బడ్జెట్లో 91 శాతం 4 పథకాలకు మాత్రమే.   రైతుబంధు, రైతుబీమా, కరెంటు సబ్సిడీ,  రుణమాఫీ.   మిగతా పథకాలకు ఇచ్చింది రూ.3 వేల కోట్లు మించదు.  వ్యవసాయ రంగం అభివృద్ధికి కావాల్సిన సంపూర్ణ, సమతుల్య ఆలోచన తెలంగాణ ప్రభుత్వంలో ఇదివరకు కొరవడింది అనడానికి ఇది ఒక నిదర్శనం.  వ్యవసాయ అభివృద్ధిపై సమగ్ర ఆలోచన ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఇస్తున్న నిధులు, పథకాలతో  రైతులకు లభిస్తున్న ఉపశమనం సున్నా.  వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు ఏ ఏడాదికి పెరిగినట్లు కనిపిస్తున్నా, కేటాయించిన మేరకు  ఖర్చు కావడం లేదు. 2014-15 నుంచి 2019-–20 వరకు, ఆరు ఏండ్లలలో మొత్తం కేటాయింపులు  రూ.71,248.92 కోట్లు కాగా,  అయిన ఖర్చు  రూ.61,047.37  కోట్లు మాత్రమే.  దాదాపు 15 శాతం నిధులు మిగుల్చుకున్నారు. రైతు బీమా పథకం కోసం 2020--21 బడ్జెట్లో   రూ.1,141 కోట్లు కేటాయించారు.  కానీ, ఖర్చు అయ్యింది కేవలం రూ.893.55 కోట్లు. 

డా. దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు