![వ్యవసాయం పేరిట.. ఇసుక దోపిడీకి స్కెచ్ !](https://static.v6velugu.com/uploads/2025/02/agriculture-sand-exlotation-of-sketch_ZeUNkctCmR.jpg)
- ములుగు జిల్లాలో కొందరు రైసింగ్ కాంట్రాక్టర్ల ప్లాన్
- మూడేండ్ల కింద రైతుల పేరిట పర్మిషన్లకు దరఖాస్తులు
- ఇప్పుడు తవ్వకాలకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ..
- దశాబ్దాలుగా సాగులో లేని భూముల్లో ఇసుక దందాకు ప్రయత్నాలు
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లాలో గోదావరి నది మధ్యలోని భూముల్లో వ్యవసాయ సాగు పేరిట ఇసుక దోపిడీకి కొందరు కాంట్రాక్టర్లు సరికొత్త స్కెచ్ వేశారు. రైతుల పేరుతో అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్లాన్ చేశారు. కాగా.. ధరణి రికార్డులతో మూడేండ్ల కింద వెంకటాపురం మండలంలో 12, వాజేడు మండలంలో10 పైగా ప్రాంతాల్లో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరిట మైనింగ్ ఆఫీసర్లకు దరఖాస్తులు వెళ్లాయి. ప్రస్తుతం తవ్వకాలకు కలెక్టర్, మైనింగ్ ఆఫీసులు చుట్టూ తిరుగుతుండడమే కాకుండా తమకు తెలిసిన ప్రజాప్రతినిధులు, లీడర్లు, ఆఫీసర్లతోనూ పైరవీలు చేయిస్తున్నారు.
ధరణి పోర్టల్ లో ఎక్కించి.. పట్టాలుగా మార్చి..
ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో గోదావరి నది పారుతోంది. నది మధ్యలో వేసవిలో కనిపించే ఖాళీ భూములకు గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ లో సర్వే నంబర్లు కేటాయించారు. ఉమ్మడి ఏపీలో సెటిల్ మెంట్, ఏక్ సాల్, పోరంబోకు, సొసైటీ ఉమ్మడి సాగు భూములుగా ధరణి పోర్టల్ లో గుర్తించారు. వీటిని కొందరు బినామీ రైతుల పేరు మీద పట్టాలుగా ఎక్కించారు. అయితే.. నలభై ఏండ్లుగా ఆయా భూములు సాగులో లేకపోవడంతో నదికి వచ్చిన వరదలతో ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు వాటిలో వ్యవసాయ సాగు పేరిట ఇసుక తవ్వకాలు చేస్తామంటూ దోపిడీకి ప్లాన్ చేశారు.
ఫిజికల్ సర్వే పేరుతో పర్మిషన్లు
గతేడాది కొన్ని పట్టా భూములకు ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చారు. రూల్స్ కు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారనే ఫిర్యాదులతో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వెంకటాపురం మండలం అలుబాక, వాజేడు మండలం ధర్మారంలోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు రెడీ అయ్యారు.
ధర్మారంలోని పట్టా భూమి ఫిజికల్ సర్వే పేరుతో పర్మిషన్లు పొందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలుబాకలో గతేడాది ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు తీసుకుని ఇసుక క్వారీ స్టార్ట్ చేయగానే, ఏండ్లుగా సాగులో లేని నది మధ్యలోని భూములంటూ ములుగు కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పటికే వర్షాలు కురుస్తుండడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త ఇసుక రీచ్ లపై నో క్లారిటీ..
సొసైటీ ఇసుక రీచ్ లకు రాష్ట్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డుల క్లియరెన్స్ లు తప్పనిసరిగా ఉండాలి. జాయింట్ ఇన్స్ స్పెక్షన్ లోనూ అన్ని శాఖలు నో అబ్జెక్షన్ ఇస్తేనే ఇసుక తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. కాగా.. ప్రస్తుత ప్రభుత్వం పాత సొసైటీలకే ఇసుక తవ్వకాలకు రూల్స్ మేరకు అనుమతులు ఇస్తుంది.
కొత్త ఇసుక రీచ్ లకు ఎప్పుడు మంజూరు అవుతాయి? అనేది ప్రశ్నర్థకంగా ఉంది. దీంతో రైసింగ్ కాంట్రాక్టర్ల చూపు ఇసుక మేటల భూములపై పడింది. ఆయా భూములకు పై విధమైన అనుమతులేవీ అవసరం లేదు. కేవలం జిల్లా కలెక్టర్లు, మైనింగ్ ఆఫీసర్ అనుమతిస్తే సరిపోతుంది.
30 అడుగుల లోతున తవ్వుతున్రు
ఇసుక రీచ్‌లు ఉన్న చోట నదిలో 30 అడుగుల లోతు భారీ మెషీన్లతో తవ్వుతున్రు. దీంతో మోటార్లు నీళ్లు పోయక సాగు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇసుక క్వారీ నిర్వహణతో .. 2022లో గోదావరి వరదల్లో 4 ఎకరాల భూమి పోగా.. 3 ఎకరాలే మిగిలింది. ఆఫీసర్లు స్పందించి సర్కారు రూల్స్ ప్రకారమే ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వాలి.
– బోట రామ్మూర్తి (రైతు), పాత్రపురం, వెంకటాపురం మండలం -