మనదేశ చరిత్రకారులు మన చరిత్రలో విస్మరించిన అంశాల జాబితా పెద్దగానే ఉంటుంది. విస్మరణకు గురైన గొప్ప పాలనాదక్షురాలు, సమాజ సంస్కర్త, సాహసి ‘దేవీ అహల్యాబాయి హోల్కర్’. పాలకులు అభ్యుదయం వైపు ఎలా దృష్టి సారించాలో ఆమె ఆనాడే పాఠాలు చెప్పారు. సంచార తెగలో పుట్టిన సమర్థ పాలకురాలు అహల్యాబాయి 31 మే 1725లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ దగ్గరున్న చోంగి గ్రామంలో సుశీలా షిండే, మంకోజీ షిండేలకు జన్మించింది. ఆ ప్రాంతాన్ని పాలించే మల్హరరావు హోల్కర్ తన రాజ్యపర్యటనలో భాగంగా ఓరోజు అహల్య పుట్టిన గ్రామానికి వచ్చి, రాత్రి అక్కడే బస చేశాడు.
రాత్రివేళ స్థానిక దేవాలయంలో అహల్య పాడిన 'హారతిపాట' విని ఆయన ముగ్ధుడయ్యాడు. 10 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి ధైర్యం , భక్తిప్రపత్తులకు ఆయన మురిసిపోయి అహల్యాబాయి తండ్రిని ఒప్పించి తన కొడుకు ఖండేరావు హోల్కర్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. అహల్యాబాయి రాజకుటుంబంలో ప్రవేశించి పాలనా వ్యవహారాలు, యుద్ధనైపుణ్యాలు, రాచరిక వ్యవస్థలోని విషయాలు అనతికాలంలో నేర్చుకొంది.
అహల్యను వెంటాడిన దుస్సంఘటనలు
రాజకుటుంబంలో ఆమె ప్రవేశించి అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న సమయంలో వరుస దుస్సంఘటనలు ఆమెను దెబ్బతీసాయి. తన భర్త ఖండేరావు 1754లో మరణించగా, తనను తండ్రిలాగ ఆదరించిన మామ మల్హరరావు 1766లో, అదే సంవత్సరం కుమారుడు మలేరావు, అనంతరం ఆమె కూతురు ముక్తాబాయి కూడా మరణించింది. దాంతో అహల్య పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.
16 ఏళ్ల కుమారుడిని పోగొట్టుకొని దుఃఖంతో కునారిల్లుతూనే ప్రజల కోసం శివభక్తురాలిగా, శివుని ప్రాతినిధ్యంగా 1767లో సింహాసనం అధిష్టించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావత్‌ను అణచివేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూణేలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.
జాతీయవాద దృష్టి
రాణి అహల్యాబాయిది జాతీయవాద దృష్టి. ఆ రోజుల్లో మరాఠా సామ్రాజ్యంలో భిల్లులు దారి దోపిడి దొంగలుగా ఉండేవారు . వారివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం అహల్యాబాయి ఒక వింత పద్ధతిని ఉపయోగించారు. తన ధైర్యసాహసాలు ప్రదర్శించి భిల్లులను ఓడించే వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ఆమె మొదట ప్రకటించింది.
ఫాన్సే అనే వ్యక్తి విజయవంతంగా పోరాడి భిల్లులను ఓడించాడు. వెంటనే అతనితో తన కుమార్తెకు వివాహం జరిపించింది. తరువాత భిల్లుల సంరక్షణ కోసం ఆమె వారికి సరిహద్దులను కాపాడే పనిని కేటాయించింది. విదేశీ పాలకుల వల్ల దేశవ్యాప్తంగా ధ్వంసం అయిన అనేక వందల దేవాలయాలను పునర్నిర్మించింది రాణి అహల్యాబాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు దగ్గరలోని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో ఆమె చేత నిర్మితమైన ప్రసిద్ధ శివాలయం ఒకటి ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం.
నాడే మహిళా సాధికారతకు పెద్దపీట
అహల్యాబాయి మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల అంక్షల తొలగింపు వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తన పాలనలో తీసుకుంది. సామాన్యులు తమ గోడు చెప్పుకోవడానికి అమె కోట తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. రాణి అహల్యాబాయి హోల్కర్ 13 ఆగస్టు 1795న తన 70వ ఏట తనువు చాలించింది. ఆమె త్రిశత జయంతి ఉత్సవాలు మే 31, 2024న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రారంభమై, దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు జరుగుతాయి. భగవద్గీతలో పేర్కొన్న 'కర్మయోగి” అనే పదానికి సరైన అర్థాన్నిచ్చింది రాణి అహల్యాబాయి జీవితం.
-
డా. పి. భాస్కర యోగి, సామాజిక, రాజకీయ విశ్లేషకులు