కూల్చివేతలు చట్ట ప్రకారం ఉండాలి

కూల్చివేతలు చట్ట ప్రకారం ఉండాలి
  • వివరణ తీసుకునిముందుకెళ్లాలి: హైకోర్టు
  • అనురాగ్‌‌‌‌ యూనివర్సిటీ అక్రమ నిర్మాణాల కేసులో ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి జిల్లా కొర్రెముల (వెంకటాపూర్‌‌‌‌) గ్రామంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్‌‌‌‌ సొసైటీ, అనురాగ్‌‌‌‌ యూనివర్సిటీ  నిర్మాణాల తొలగింపుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాల తొలగింపునకు ఆధారాలైన ప్రతి డాక్యుమెంట్​ను యాజమాన్యానికి అందజేసి, వారి వివరణ తీసుకున్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌జోన్‌‌‌‌ల ఆక్రమణల పేరుతో కూల్చివేత చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్‌‌‌‌ సొసైటీ, అనురాగ్‌‌‌‌ వర్సిటీ, నీలిమా ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ సైన్స్‌‌‌‌స్‌‌‌‌లు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌‌‌‌రెడ్డి చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్‌‌‌‌ను అందజేశారు. 1951–54 కాస్రా పహాణీ ప్రకారం 61 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు.

పిటిషనర్లు ఇదే అభ్యర్థనతో గత వారం పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారని, ఇప్పుడు మళ్లీ అనవసర ఆందోళనతో మరో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారన్నారు. చట్టప్రకారమే ముందుకెళతామని, అన్ని పత్రాలను అందజేసి వివరణ తీసుకున్నాకే చర్యలు చేపడతామన్నారు.  పత్రాలు ఇచ్చిన తరువాత వాటిని పరిశీలించి వివరణ ఇవ్వడానికి కనీసం ఒక వారం అయినా గడువు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు.

తాము చట్టప్రకారం ముందుకెళ్తామని, పిటిషనర్లు ఎలాంటి నిర్మాణాలు కొనసాగించకుండా చూడాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కాగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీని రికార్డు చేసి పిటిషన్‌‌‌‌పై విచారణను మూసివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.