
రంజాన్ మాసం సమీపిస్తోంది.. ముస్లింలు పవిత్రంగా భావించే ఈ మాసంలో ఉపవాస ( రోజా ) దీక్షకు సిద్ధమవుతున్నారు. రంజాన్ కోసం ముస్లింలు ఎంతగా ఎదురుచూస్తారో హలీం ప్రియులు కూడా అంతే ఎదురు చూస్తారు. రంజాన్ స్పెషల్ హలీం ఇందుకు కారణం.హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న తేడా లేకుండా చాలామంది హలీంకి ఫ్యాన్స్ ఉన్నారు.అయితే.. రంజాన్ వేళ హలీం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి రెస్టారెంట్లు. హలీం ధరలను భారీగా పెంచాయి హైదరాబాద్ రెస్టారెంట్లు. హలీం ధర 10శాతం నుండి 20శాతం వరకు పెంచాయి రెస్టారెంట్లు. ప్రస్తుతం రూ. 280గా ఉన్న హలీం రూ. 30 నుంచి రూ. 50వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
మటన్, మసాలా ధరలు పెరగడమే కారణం
మటన్, మసాలా దినుసుల రేట్లు పెరగడమే హలీం రేట్లు పెంచడానికి కారణమని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి మసాలా దినుసుల రేట్లు 25శాతం వరకు పెరిగాయని.. మటన్ రేట్లు కూడా గత ఏడాదికంటే ఎక్కువ ఉండటంతో హలీం రేట్లు పెంచక తప్పలేదని అంటున్నారు రెస్టారెంట్ యజమానులు. కొన్ని రెస్టారెంట్లలో హలీం ధర రూ. 280గా ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్లలో రూ. 340గా ఉంది.
రంజాన్ మాసంలో హలీంకు ఆఫ్ లైన్ డిమాండ్ ఎక్కువ:
కొంతకాలం కింద వరకు రంజాన్ మాసంలో తప్ప ఇతర సమయంలో హలీం పెద్దగా దొరికేది కాదు. కానీ.. ఇప్పుడు ఏ సీజన్లో అయినా హలీం దొరుకుతోంది.జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో కూడా హలీం లభిస్తోంది. అయితే..రంజాన్ సీజన్లో మాత్రం హలీంకు ఆఫ్ లైన్లోనే డిమాండ్ ఎక్కువ ఉంటుందని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా..ఈ ఏడాది బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న క్రమంలో చికెన్ హలీం అమ్మకాలపై రెస్టారెంట్లు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.