
- మూడు సెగ్మెంట్ల పై ఫోకస్
- ఎన్నికల ముంగిట పార్టీ జోరు
సిద్దిపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నాయకులు చేరికలపై దృష్టిపెట్టారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి అధిక సంఖ్యలో నాయకులను చేర్చుకునే దిశగా కసరత్తు జరుపుతున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఇన్‌చార్జిలు చేరికల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారైతే మూడు సెగ్మంట్ల లో చేరికలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. దశాబ్దకాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ క్రమంగా బలం కోల్పోతుండడంతో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవాలంటే బీఆర్ఎస్ తోపాటు బీజేపీ నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలను చేర్చుకుని కొంత మేర దెబ్బకొట్టాలనే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వచ్చే రోజుల్లో మరిన్ని చేరికలు
జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చే రోజుల్లో మరిన్ని చేరికలు జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉన్న సిద్దిపేటలో అదే పార్టీకి చెందిన పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేతలు, బీఆర్ఎస్లో ఆదరణకు నోచుకోని నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైతే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీల నుంచి అధిక సంఖ్యలో చేరికలుంటాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇప్పటికి మూడు సెగ్మంట్ల లో మండల స్థాయి నేతలు పార్టీలో చేరుతుండగా రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొత్త పాతలు కలిసేనా..?
దశాబ్దకాలంగా అధికారంలో లేకున్నా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పార్టీని అంటిపెట్టుకున్న వారికి కొత్తగా పార్టీలోకి వస్తున్న వారి మధ్య సయోధ్య కుదురుతుందా అనే అనుమానం అందరిలో వ్యక్తమవుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ నేత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీంతో తమకు సమాచారం లేకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడంపై స్థానిక నేతలు హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. .
ఆయన ఇటీవల పార్టీ ఆఫీస్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాగా ఆయన రాకను ఇష్టపడని నేతలు కార్యక్రమం ముగిసిన తర్వాత సదరు నేత తిరిగిన ప్రాంతాన్ని పాలతో శుద్ధి చేయడం గమనార్హం.