అహ్మద్ పటేల్ కాంగ్రెస్ చాణక్యుడు

దశాబ్దాలుగా కాంగ్రెస్​ పార్టీకి ఓ పిల్లర్​గా నిలిచిన నాయకుడు అహ్మద్​ పటేల్. పార్టీకే కాదు రాజీవ్​గాంధీ హయాం నుంచి ఆ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన ఆయన.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ట్రబుల్​ షూటర్​గా నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి పరిస్థితిని సోనియాగాంధీకి వివరించి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఎంతో సాయపడ్డారు. అంత సీనియర్​ లీడర్​ అయినా, పవర్​ఫుల్​ పొజిషన్​లో ఉన్నా.. హడావుడి చేయకుండా పార్టీలో ఓ కార్యకర్తగా, అందరికీ అందుబాటులో ఉండే వారు. ఆయన మరణం కాంగ్రెస్​కే కాదు.. దేశానికి కూడా లోటే.

కాంగ్రెస్  పార్టీకి కష్టం వచ్చిన ప్రతి సందర్భంలో ట్రబుల్ షూటర్ గా ముందు నిలిచిన నేత అహ్మద్ పటేల్. గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుగా, నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చిన ఆయన.. నెల రోజులుగా కరోనాతో పోరాడి, బుధవారం కన్నుమూశారు. ఆయన కొరత తీరేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. మూడుసార్లు లోక్ సభకు, ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ గుజరాత్ లో 1949 ఆగస్టు 21న జన్మించారు. 1995లో తొలిసారి రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అహ్మద్ పటేల్ అప్పటి నుంచీ గాంధీ ఫ్యామిలీకి సన్నిహితుడిగానే కొనసాగారు. ఆయన మాటకు తిరుగు ఉండేది కాదు. 2011లో గుజరాత్​ నుంచి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సరిపడా మెజార్టీ లేకున్నా.. బీజేపీ సీనియర్​ నేత అమిత్ షా రాజకీయాన్ని ఎదుర్కొని మరీ గెలిచారు. రాజీవ్ గాంధీ తర్వాత సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కూడా సలహాదారుగా, నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి జాతీయ కోశాధికారిగా, సోనియాకు రాజకీయ సలహాదారుగా ఉన్నారు.

కాంగ్రెస్​కు అతిపెద్ద లోటు

కాంగ్రెస్​కు ఇప్పుడే మొదటిసారిగా కష్టకాలం వచ్చినట్టుగా పలువురు నేతలు పార్టీని వీడిపోతున్న ఇలాంటి టైంలో అహ్మద్  పటేల్ మరణం అతిపెద్ద లోటు అని చెప్పొచ్చు. ఒక షరీఫ్  ఆద్మీగా, కాంగ్రెస్ పార్టీకి ఒక పిల్లర్ గా అహ్మద్ ​పటేల్​కు పేరుంది. యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల ఏర్పాటులోనూ అహ్మద్  పటేల్  పాత్ర కీలకంగా పేర్కొనవచ్చు. ఆయన ఎప్పుడూ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు, చివరికి మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా.. తాను లీడర్​ను కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే అనేవారు. అహ్మద్ పటేల్ లోని మంచితనానికి ఈ మాటలు ఒక నిదర్శనం. తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఒకసారి ఆయన కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వస్తుంది.. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఇస్తుంది’’ అన్న విషయం నాకింకా గుర్తుంది. ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ను కూడా అహ్మద్​పటేల్​ మెచ్చుకునేవారు. అప్పట్లో కాంగ్రెస్  ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్​ వంటి వారిని అభినందించేవారు. ఏదేమైనా అహ్మద్ పటేల్ ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన వంటి అత్యుత్తమ ఆలోచనలు, ఆచరణ, అంకితభావం గల నాయకుల కొరత ఈ దేశానికి రోజు రోజుకు పెరిగిపోతోంది.

తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అహ్మద్ పటేల్  కీలకపాత్ర పోషించారు. తెలంగాణ బిల్లును సోనియా గాంధీ అంగీకరించేలా చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాహుల్  గాంధీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నించారు. ఈమేరకు అవసరమైన పలు నివేదికలను కూడా కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీకి అహ్మద్ పటేలే సమర్పించారని చెప్తుంటారు. తెలంగాణ సాధన కోసం దశాబ్దాలుగా పోరాడి.. ఓసారి పోలీసు కాల్పులకు కూడా గురైన కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలన్న డిమాండ్​తో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్​ను బహిష్కరించారు. ఆ సమయంలో కాకా వెంకటస్వామికి వర్కింగ్​ కమిటీలో అహ్మద్​పటేల్​ పూర్తి మద్దతుగా నిలిచారు. వెంకటస్వామి తనయులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్  తదితరులతో కలిసి నేను కూడా రెండు మూడు సార్లు అహ్మద్ పటేల్​ను కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో వివేక్, తోటి ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొంటూ.. అహ్మద్ పటేల్, ఇతర కీలక నేతలపైనా ఒత్తిడి తెచ్చారు. జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోదండరాం, కాకా వెంకటస్వామి ఇంట్లో కలిసి తెలంగాణ విషయంలో చర్చలు జరిపేవారు. తర్వాత కాకా నేరుగా అహ్మద్​పటేల్​కు  ఫోన్​ చేసి మాట్లాడి విషయం వివరించేవారు. తెలంగాణ విషయంలో జాప్యం చేయవద్దని అహ్మద్​పటేల్​పై వారు ఒత్తిడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

-ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్టు

For More News..

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?

మార్కెట్‌కి వస్తున్న తొలి గేమింగ్ కంపెనీ