T20 World Cup 2024: పాకిస్థాన్ జనాలను మోసం చేస్తుంది: మాజీ పాక్ బ్యాటర్

T20 World Cup 2024: పాకిస్థాన్ జనాలను మోసం చేస్తుంది: మాజీ పాక్ బ్యాటర్

చివరి వరల్డ్ కప్ 2022 లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 చేరుకోవడానికి కష్టాలు పడుతుంది. మూడు  మ్యాచ్  లాడిన పాక్ జట్టు కెనాడతో మాత్రమే విజయం సాధించింది. ఐర్లాండ్ తో మిగిలిన మ్యాచ్ గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్, అమెరికా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిస్తే పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ లో గెలిచినా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే పాక్ ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు ఓడిపోయిన పాకిస్థాన్ పై విమర్శల వర్షం కురుస్తుంది. సొంత దేశం ఆ జట్టు ఆట తీరుపై  మండిపడుతుంది. తాజాగా బాబర్‌ను విమర్శిస్తున్న వారిలో పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ కూడా చేరాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై ప్రశ్నించినప్పుడు.. B, C, D జట్లపై పాక్ మ్యాచ్ లు గెలుస్తూ ప్రజలను ఫూల్స్ చేశారని షెహజాద్ అన్నాడు. బాబర్ అజామ్ గురించి మాట్లాడుతూ పెద్ద టోర్నమెంట్లలో బాబర్ గణాంకాలు అత్యంత దారుణంగా ఉన్నాయని.. మ్యాచ్ లు గెలిపించలేనివాడు కింగ్ ఎలా అవుతాడని ఈ మాజీ పాక్ బ్యాటర్ మండిపడ్డాడు. 

టోర్నీలో మూడు మ్యాచ్ లాడిన పాకిస్థాన్ ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అమెరికా, భారత్ జట్లపై ఓడిపోయిన పాక్.. కెనడాతో నానా తంటాలు పడి బోణీ కొట్టింది. పాక్ సూపర్ 8 కు అర్హత సాధించాలంటే భారత్ లేదా అమెరికా చివరి రెండు మ్యాచ్ లు ఓడిపోవాలి. అదే సమయంలో ఐర్లాండ్ పై భారీ తేడాతో గెలవాలి.