దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ స్పెషల్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఇవాళ శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించగా.. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ సిటీలోని 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది చనిపోగా... 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిదీన్ తో సంబంధం ఉన్న వాళ్లే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపాయి. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను గుజరాత్ స్పెషల్ కోర్టు విచారించింది. వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారించగా... సరైన సాక్ష్యాలు లేవని మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
2008 Ahmedabad serial bomb blast case | A special court pronounces death sentence to 38 out of 49 convicts pic.twitter.com/CtcEWGze2z
— ANI (@ANI) February 18, 2022