
పలు చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న దేవ్ గిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’. త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రా శుక్లా హీరోయిన్. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన భార్య ఆర్తి నిర్మిస్తున్నారు. గురువారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దేవ్ గిల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన యాక్షన్ మార్క్‌ను చూపిస్తూ ఇంప్రెస్ చేశాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దేవ్ గిల్ మాట్లాడుతూ ‘పదమూడేళ్ల క్రితం ‘మగధీర’ చిత్రంతో రాజమౌళి గారు నాకు లైఫ్ ఇచ్చారు. విలన్‌గా నాపై ప్రేమను చూపించిన ప్రేక్షకులు హీరోగానూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. త్రికోటి చాలా పెద్ద విజన్ ఉన్న డైరెక్టర్. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా’ అని అన్నాడు. చిత్రా శుక్లా మాట్లాడుతూ ‘నేను పెళ్లి చేసుకున్న తర్వాత రాబోతోన్న మొదటి చిత్రమిది.
ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. త్రికోటి మాట్లాడుతూ ‘దేవ్ గిల్‌కు పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. తెలుగు, హిందీ భాషల్లో షూటింగ్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని అన్నాడు. ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోందని నిర్మాత ఆర్తి అన్నారు. మరాఠీ నటుడు ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యువరాజ్ పాల్గొన్నారు.