రేపటి నుంచి ఏఐ తరగతులు

రేపటి నుంచి ఏఐ తరగతులు
  • ప్రాథమిక విద్యాబోధనలో ఆధునిక సాంకేతిక వినియోగం
  • నాగర్​కర్నూల్​ జిల్లాలో పైలట్​ప్రాజెక్టు కింద13 స్కూళ్లు​ ఎంపిక

నాగర్​ కర్నూల్, వెలుగు: ప్రాథమిక విద్యను ఆధునిక సాంకేతికత(ఏఐ–ఆర్టిఫిషియల్​ ఇంజెలిజెన్స్)తో  మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ప్రైమరీ స్కూల్​విద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్, బేసిక్స్​ను మెరుగుపరిచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు నాగర్​కర్నూల్ జిల్లాలోని10 మండలాల్లో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపికయ్యాయి. ఈ స్కూల్స్​లో ఈ నెల 15 నుంచి ఏఐ ద్వారా తరగతులు ప్రారంభం కానున్నాయి.  

ఎంపికైన పాఠశాలలు ఇవే.. 

బిజినపల్లి మండలంలోని వట్టెం, చారగొండ మండలంలోని జూపల్లి, కోడేరు మండలంలోని కొండ్రావుపల్లి, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు, ఎన్మబెట్ల, పెద్దకొత్తపల్లి మండలంలోని గండ్రావుపల్లి, చంద్రకల్, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు, తాడూరు మండలంలోని ఐతుల్, తెలకపల్లి మండలంలోని  ఆలేరు, తిమ్మాజీపేట మండలంలోని మారేపల్లి, చేగుంట, వంగూరు మండలంలోని వంగూర్ ప్రాథమిక పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఈ  స్కూల్స్​లో 1,183 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు.

 వీరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యనందించేందుకు ఒక్కో బడిలో 5 నుంచి 10 కంప్యూటర్లు, అవసరమైన ఎలక్ట్రానిక్​ పరికరాలు ఏర్పాటు చేశారు.  ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

ఏఐ టూల్స్​ ద్వారా బోధన చేయాలి

వనపర్తి, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో  భాష, మ్యాథ్స్​సబ్జెక్టుల్లో వెనకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు వాటిపై పట్టు సాధించేలా ఏఐ టూల్స్ ద్వారా బోధన చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి  ఆదేశించారు.  గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో  ఎంపిక చేసిన11 పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత బోధన ప్రారంభించాలని సూచించారు. 

చంద్రకల్​ పాఠశాలలో ఏర్పాట్ల పరిశీలన

కోడేరు, వెలుగు: చంద్రకల్ ప్రాథమిక పాఠశాలను డీఈవో రమేశ్​కుమార్ గురువారం సందర్శించారు. ఏఐ తరగతులు ప్రారంభం కానున్నందున ఏర్పాట్లు పరిశీలించారు. కంప్యూటర్లను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.