ఆదిలాబాద్ జిల్లాలో మార్చి15 నుంచి  ఏఐ తరగతులు ప్రారంభం : కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి15 నుంచి  ఏఐ తరగతులు ప్రారంభం : కలెక్టర్ రాజర్షి షా 
  • పైలట్ ప్రాజెక్టుగా 9 ప్రైమరీ స్కూళ్లు ఎంపిక 

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలోని ఎంపిక చేసిన ప్రైమరీ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరగతులను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఎస్కెట్ ఫౌండేషన్ సహకారంతో  పైలట్ ప్రాజెక్టు కింద 9 గవర్నమెంట్​ ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేశామన్నారు.

 తొలి విడతలో తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్, ఆదిలాబాద్ అర్బన్ తాటిగూడ పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.  ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక క్వాలిటీ కంట్రోలర్, ఎంఈవో, హెడ్​మాస్టర్, ఒక ప్రాథమిక పాఠశాల టీచర్ రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారని తెలిపారు.  ప్రాథమిక స్థాయి విద్యార్థులు భాషలో అభ్యసన సామర్థ్యాలు, గణితంలో చతుర్విద ప్రక్రియల్లో వెనకబడి ఉన్నారని చెప్పారు.

ఈ క్రమంలో ఏఐ సహాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. చదువులో వెనకబడి ఉన్న పిల్లలను గుర్తించి, వారి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో 5 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని, విండోస్ 10 తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని పేర్కొన్నారు. 24 గంటలు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.  డీఈవో ప్రణీత, ఎంఈవోలు మనోహర్, వెంకట్రావు, క్వాలిటీ కో‌‌–ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులున్నారు.