తెలంగాణలో 424 ప్రభుత్వ స్కూళ్లలో మొదలైన ఏఐ క్లాసులు

తెలంగాణలో  424 ప్రభుత్వ స్కూళ్లలో  మొదలైన ఏఐ క్లాసులు
  • 3,4,5వ క్లాసుల పిల్లలకు గణితం, తెలుగులో మెలకువలు
  • పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు ఏఐ సహకారం

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ను వినియోగిస్తూ స్టూడెంట్లకు పాఠాలు చెప్పిస్తున్నది. గతనెలలో ప్రయోగాత్మకంగా ఆరు జిల్లాల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో మిగతా 27 జిల్లాల్లో అధికారులు శనివారం ప్రారంభించారు. చదువులో వెనుకబడుతున్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతున్నది. వచ్చే ఏడాది మరో వెయ్యికి పైగా బడుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 21వేలకు పైగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ సర్కారు స్కూళ్లున్నాయి. ప్రైమరీ లెవెల్ లో విద్యార్థుల్లో లెర్నింగ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండటంతో ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ) ప్రోగ్రామ్ ను గతంలో ప్రారంభించారు. దీని ద్వారా ఆశించిన ప్రయోజనాలు రాకపోవడంతో, ఏఐని తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి 24న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్​గిరి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని 41 ప్రైమరీ స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్ ఏఐ(ఏఎక్స్ఎల్) ను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. ఇది సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ బడుల్లో దీన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా మిగిలిన 27 జిల్లాల్లో 383 ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసి శనివారం ప్రారంభించింది. కంప్యూటర్లు అందుబాటులో ఉన్న బడుల్లో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్లకే బడులను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈకే-స్టెప్ అనే సంస్థ సహకారంతో ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా ఏఐ బోధన కొనసాగిస్తున్నారు.

ప్రాథమిక స్థాయిలో..

సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో లెర్నింగ్ ఔట్ కమ్స్ లేవు. దీంతో ముందుగా ప్రైమరీ లెవెల్​లో 3,4,5వ క్లాసులను ఎంపిక చేసుకున్నారు. ముందుగా తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఏఐ టూల్స్ ద్వారా సామర్థ్యాలను పెంచుకునేలా చర్యలు చేపట్టారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన ఐదుగురిని ఒక బ్యాచ్​గా తయారు చేసి వారికి క్లాసులు వినిపిస్తారు. ఒక్కో క్లాసు సుమారు 20  నిమిషాల పాటు కొనసాగించనున్నారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలకు అనుగుణంగా ఏఐ టూల్స్ వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన చేయనున్నాయి. కంప్యూటర్లకు హెడ్ ఫోన్స్ ఏర్పాటు చేసి, వాటి సహకారంతో పిల్లలకున్న డౌట్లను క్లియర్ చేయనున్నారు.