బ్యాంకు ఉద్యోగాలకు ఏఐ ఎసరు

  • ఐదేండ్లలో 2 లక్షల మందిని తీసేయనున్న  గ్లోబల్ బ్యాంకులు
  • కస్టమర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ వంటి రొటీన్ జాబ్‌‌‌‌‌‌‌‌లను భర్తీ చేయనున్న ఏఐ

న్యూఢిల్లీ: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో రెండు లక్షల మంది ఉద్యోగులను గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు తీసేస్తాయని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ ఇంటెలిజెన్స్ (బీఐ) అంచనా వేస్తోంది. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తుండడమే. చాలా బ్యాంకులు తమ  ఐటీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ బ్యాంకులు తమ ఉద్యోగుల్లో 3 శాతం మందిని తీసేస్తాయని అంచనా. 

చీఫ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్, టెక్నాలజీ ఆఫీసర్ల నుంచి అభిప్రాయాలను సేకరించాక ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను సంస్థ రెడీ చేసింది. చాట్ బాట్స్‌‌‌‌‌‌‌‌ వస్తుండడంతో కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మార్పులు రానున్నాయి. అంతేకాకుండా కేవైసీ పనులు చూసుకునే వారి జాబ్స్ కూడా ఏఐతో ప్రమాదంలో పడ్డాయి. ‘ రొటీన్‌‌‌‌‌‌‌‌, తరచూ చేసే పనులను ఏఐ చూసుకోగలుగుతుంది. ఈ జాబ్స్ పూర్తిగా పోవు. కానీ, జాబ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో భారీగా మార్పులు వస్తాయి’ అని బీఐ సీనియర్ ఎనలిస్ట్ తొమాజ్‌‌‌‌‌‌‌‌ నోట్జెల్‌‌‌‌‌‌‌‌ వివరించారు. బ్యాక్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, మిడిల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు ఏఐతో గండం ఉందని తెలిపారు. 

పెరగనున్న బ్యాంకుల లాభాలు

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ సర్వేలో పాల్గొన్న వాటిలో  93 శాతం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు  తమ ఉద్యోగులను 5 శాతం నుంచి 10 శాతం మేర తగ్గించుకుంటామని ప్రకటించాయి. ఈ లిస్టులో సిటీ గ్రూప్‌‌‌‌‌‌‌‌, జేపీ మోర్గాన్‌‌‌‌‌‌‌‌ చేజ్‌‌‌‌‌‌‌‌ అండ్ కో, గోల్డ్‌‌‌‌‌‌‌‌మన్ శాక్స్​ వంటి బడా బ్యాంకులు కూడా ఉన్నాయి. ఏఐతో  బ్యాంకుల ఖర్చులు కూడా తగ్గనున్నాయి. 2027 నాటికి వీటి  ప్రాఫిట్స్‌‌‌‌‌‌‌‌ 12శాతం నుంచి 17 శాతం మేర  పెరుగుతాయని అంచనా. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులకు  సుమారు 180 బిలియన్ డాలర్ల ప్రాఫిట్స్ రానున్నాయి.

ఏఐతో కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ అభిప్రాయపడింది. జనరేటివ్ ఏఐతో రానున్న 3–5 ఏళ్లలో రెవెన్యూ 5 శాతం మేర పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో ఎనిమిది మంది  అంచనావేశారు. బ్యాంకులు ఐటీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్ చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టివిటీ మెరుగుపడుతుందని భావిస్తున్నాయి.

ఏఐతో ఎక్కువ జాబ్స్ బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పోతాయని సిటీ గ్రూప్ కిందటేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. సుమారు  54 శాతం జాబ్స్‌‌‌‌‌‌‌‌కు మనుషుల అవసరం ఉండదని తెలిపింది. టెక్నాలజీతో  జాబ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు మొదలయ్యాయని, కానీ ఇవి పూర్తిగా ఏఐతో భర్తీ కావని  చాలా కంపెనీలు నమ్ముతున్నాయి. ఇండియన్ బ్యాంకుల్లో కూడా  చాలా ఉద్యోగాలు తొలగిపోనున్నాయి.