- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో ఏఐ కీలకం
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియాలో 5జీ వేగంగా విస్తరిస్తోందని, అయితే 6జీతో ఇంకా మంచి రికార్డ్‌లు క్రియేట్ చేస్తామని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 లో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం 2జీ స్పీడ్‌తో ఇండియా నడిచిందని గుర్తు చేశారు. మొబైల్ వాడకంలో 155 వ ర్యాంక్‌లో ఉన్న దేశం, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్‌గా ఎదిగిందని అన్నారు. ఇండియాలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్ రివల్యూషన్ తాకిందని, బ్యాంకింగ్ సర్వీస్‌లు అందుకోని 53 కోట్ల మంది జన్‌ధన్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకి వచ్చారని ఆకాశ్ గుర్తు చేశారు.
ఇందులో 30 కోట్ల మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. ఇండియాలో డేటా వినియోగం ఎక్కువగా ఉందని, పెర్ క్యాపిటా డేటా వినియోగం 30 జీబీలతో ప్రపంచంలోనే టాప్‌లో ఉన్నామని వివరించారు హెల్త్‌కేర్,ఎడ్యుకేషన్,అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్ వంటి వివిధ సెక్టార్ల రూపురేఖలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మారుస్తుందని ఆకాశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో ఏఐ కీలకంగా పనిచేస్తుందన్నారు. తక్కువ ధరలకే ఇండియాలోనే ప్రతి ఒక్కరికి పవర్‌ఫుల్ ఏఐ టూల్స్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండియాలోని డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలని, ఇందుకోసం డేటా సెంటర్ కంపెనీలకు ప్రభుత్వం పోత్సాహకాలు ఇవ్వాలన్నారు.