ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ చాలా డేంజర్!.. మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ వార్నింగ్

ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ చాలా డేంజర్!.. మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ వార్నింగ్

న్యూయార్క్: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సింగిల్స్ కోసం రూపొందించిన ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌, ఏఐ బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ చాట్ బాట్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ల ద్వారా యువత కోరి మరీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నదని పలువురు హెచ్చరిస్తున్నారు. తాజాగా గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ కూడా ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌, ఏఐ బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌తో యువత ఎక్కువగా అటాచ్ అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌లతో ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యేవారు మునుపటికంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోతారని హెచ్చరించారు. 

ఈ మేరకు ఆయన  ఓ పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌లపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి లేదా సరదా కోసం యువత ఏఐని ఆశ్రయిస్తున్నది. వాయిస్ తోపాటు చూడటానికి బాగున్న ఏఐ గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌, ఏఐ బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌తో ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అవుతున్నారు. ఏఐ చాట్‌‌‌‌బాట్‌‌‌‌లతోనే గంటల తరబడి గడిపేస్తున్నారు. తమ ఆలోచలన్నింటిని ఏఐతో పంచుకుంటున్నారు. దీనివల్ల ఏఐ మీ మనసును బంధిస్తున్నది. ఆలోచించే విధానాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నది" అని ఎరిక్ స్మిత్ తెలిపారు. 

‘‘ఒకానొక సందర్భంలో పిల్లలు యూజ్ చేసే ఆన్ లైన్ కంటెంట్ ను పేరెంట్స్ కూడా నియంత్రించలేకపోతున్నారు.12 లేదా 13 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలు మంచితో పాటు చెడును యాక్సెస్ చేస్తున్నారు. అది తప్పని చెప్తే తట్టుకోలేక పోతున్నారు. ఏఐ మనలోని ఒంటరితనాన్ని మరింత పెంచడంతోపాటు ఒక్కోసారి సూసైడ్ కు కూడా ప్రేరేపిస్తుంది. ఇటీవల ఫ్లోరిడాలో 14 ఏండ్ల సెవెల్ సెట్జెర్ ఏఐ ప్రేమలో పడి తన తండ్రి తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న ఘటనను మనం మరవరాదు” అని ఆయన గుర్తుచేశారు.