ఇంటర్ ఫిజిక్స్లో ఏఐ.. వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తెచ్చే యోచనలో ఇంటర్ బోర్డు

  • రోబోటిక్స్​, డేటాసైన్స్, మిషన్​ లర్నింగ్​​ అంశాలు కూడా..
  • జువాలజీలో ‘కొవిడ్’పై అవగాహన పాఠం

హైదరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను అప్​డేట్ చేసేందుకు ఇంటర్మీడియెట్ సిలబస్​లో మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఫిజికల్ సైన్స్​లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, డేటా సైన్స్​ తదితర అంశాలను చేర్చబోతున్నారు. దీనికితోడు కొవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా సిలబస్​లో మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ప్రింట్ చేసేందుకు ఇంటర్మీడియెట్​ బోర్డు కసరత్తు చేస్తున్నది.

ఇంటర్ విద్యార్థులపై చదువుల భారం తగ్గించేందుకు  వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్​ను  తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. దీనికితోడు అవసరమైన పాఠాలనూ చేర్పాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లోని సిలబస్ లో మార్పులు  చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో సిలబస్ కమిటీలు వేయగా, వారంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు.  కెమిస్ట్రీ, ఫిజిక్స్ తో పాటు జువాలజీ, బాటనీ సిలబస్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సిలబస్ లో కోత పెడుతున్నారు. దీనికితోడు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా వివిధ అంశాలను చేర్చడంపై దృష్టిపెట్టారు.

సెకండియర్​ ఫిజిక్స్​లో చేంజెస్​
ఇంటర్​ ఫిజిక్స్ లో ఏఐతోపాటు రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లర్నింగ్ తదితర అంశాలను చేర్చాలని ఇంటర్మీడియెట్​ అధికారులు భావిస్తున్నారు. సెకండియర్ లో ఎలక్ట్రానిక్స్​ చాపర్ట్ లో కొంత పార్ట్ తీసేసి.. వీటిని యాడ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయా కోర్సులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. బీటెక్, డిగ్రీలోని ఆయా కోర్సులకు ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో ముందుగానే ఆయా సబ్జెక్టులను స్టూడెంట్లకు పరిచయం చేయాలని నిర్ణయించారు. పిల్లలపై భారం తగ్గించేందుకు కేవలం ఆయా అంశాలను సంక్షిప్తంగా పెట్టనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు.

దీనికి తోడు జువాలజీలోనూ ‘కొవిడ్’ పాఠాన్ని చేర్చబోతున్నారు. అలాంటి వైరస్ లు  వ్యాపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమాజంలోనూ ఎలాంటి అవగాహన కల్పించాలి? అనే అంశాలను సిలబస్ లో పొందుపరుస్తున్నారు. కాగా, ప్రస్తుతం విద్యార్థులపై భారం పడకుండా సిలబస్లో మార్పులు చేస్తున్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. ఎన్సీఈఆర్టీని దృష్టిలో పెట్టుకొని జేఈఈ, నీట్, సీయూఈటీ ఎంట్రెన్స్లకు తగ్గట్టుగా ఈ మార్పులు చేస్తున్నట్టు వివరించారు.