సికింద్రాబాద్, వెలుగు: అంధులకు అందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలు వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మనుషులను, వస్తువులను గుర్తించడం, దారి చూపించడం వంటి సామర్థ్యాలు ఉన్న కళ్లద్దాలను రూపొందించిన కిమ్స్ ఫౌండేషన్, రీసెర్చ్ సెంటర్‌ను గవర్నర్ అభినందించారు. తెలంగాణలోని అంధులను ఆదుకునేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గురువారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం జరిగిన స్మార్ట్ కళ్లద్దాల పంపిణీలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించారు. కొందరు అంధులకు కళ్లద్దాలు అందించారు. ప్రపంచంలోని అంధుల్లో దాదాపు 2 కోట్ల మందికి పైగా మన దేశంలోనే ఉన్నారని చెప్పారు. అలాంటి వారికోసం శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు స్మార్ట్కళ్లద్దాలు తయారుచేయడం అభినందనీయమన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరావు మాట్లాడుతూ డీఆర్‌డీఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి.భుజంగరావు నేతృత్వంలోని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏఐ కళ్లద్దాలను రూపొందించిందినట్లు పేర్కొన్నారు. రూట్ మ్యాప్ ను తెలియజెప్పేలా ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించామని, ఇవి అంధులకు అసాధారణ సేవలు అందిస్తాయని చెప్పారు.