
- మహిళా రైతు ఉత్పత్తి సంఘాలకు బాధ్యతలు
- బెంగళూరు నుంచి ప్రత్యేక మెషీన్ కొనుగోలు
- పరీక్షల ఆధారంగా సేంద్రియ పంటల సాగు
నిర్మల్, వెలుగు: వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం నానాటికి పెరిగిపోతుండగా భూసారం నశిస్తుండడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. భూసార పరీక్ష కేంద్రాల్లో మట్టి నమూనా పరీక్షలు క్రమంగా జరగకపోవడం, రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మట్టి నమూనా పరీక్షా కేంద్రాల్లో మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో పాటు సిబ్బంది సరిపడా లేదు.
దీంతో లక్ష్యానికనుగుణంగా మట్టి నమూనా పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ భూసార పరిరక్షణతో పాటు సంప్రదాయ విత్తనాల పెంపుదలకు స్పెషల్ ప్రోగ్రామ్ రూపొందించింది. ఇందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తూ భూసార పరీక్షలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఏఐ టెక్నాలజీతో మట్టి నమూనాను పరీక్షించే మెషీన్ ను బెంగళూరు నుంచి తెప్పించింది. దీని ద్వారా భూసార పరీక్షలు చేసేందుకు ఇప్పటికే జిల్లా అధికారులు రెడీ అయ్యారు.
మహిళా రైతు ఉత్పత్తి సంఘాలకు బాధ్యతలు
ఏఐ టెక్నాలజీ మెషీన్ ద్వారా చేపట్టబోయే భూసార పరీక్షల బాధ్యతలను జిల్లాలోని మహిళా రైతు ఉత్పత్తి సంఘాలకు ఇవ్వనున్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్ మట్టి నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు మహిళా రైతు ఉత్పత్తి సంఘాలు ఉండగా, వీటిలో 2,000 మంది సభ్యులు ఉన్నారు. ఇక మట్టి నమూనా పరీక్షలను దశలవారీగా చేపడతారు.
పరీక్షల ఆధారంగా పంటల సాగు
ఏఐ టెక్నాలజీతో చేసిన మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఇక నుంచి మహిళా రైతు ఉత్పత్తి సంఘాలు దేశీయ సంప్రదాయ పంటల సాగును చేపడతాయి. దేశీ సీడ్ ప్రోగ్రామ్ పేరిట వరి, నువ్వులు, కందులు, జొన్న కూరగాయ పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు. ఇప్పటికే 200 మంది మహిళా రైతులు ఏఐ టెక్నాలజీతో నిర్వహించే మట్టి నమూనా పరీక్షల ఆధారంగా విత్తనాలను సాగు చేసేందుకు ముందుకొచ్చారు. కాగా సీడ్స్ ను మహారాష్ట్రలోని సోలాపూర్, ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల నుంచి తీసుకురానున్నారు.