బ్రేకప్ అయిన గర్ల్స్ను ఓదారుస్తున్న ఏఐ బాయ్ ఫ్రెండ్స్..!

బ్రేకప్ అయిన గర్ల్స్ను ఓదారుస్తున్న ఏఐ బాయ్ ఫ్రెండ్స్..!
  • చదువులు చెప్తయ్..ఓదారుస్తయ్! 
  • సరికొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి..
  • జేఈఈ, నీట్ కోచింగ్ చెప్తున్న అలఖ్ ఏఐ టూల్ 
  • బ్రేకప్ అయిన గర్ల్స్ను ఓదారుస్తున్న ఏఐ బాయ్ ఫ్రెండ్స్

హైదరాబాద్, వెలుగు: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్నది. చేసే ప్రతి పనిలో ఏఐ వాడకం పెరిగిపోతున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నోళ్లకు తక్కువ ఖర్చుతోనే చదువులు చెప్పేందుకు.. ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతున్నది. అంతేకాదు.. బ్రేకప్ అయిన వారు తాము ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్ పోగొట్టుకునేందుకు కూడా ఏఐ తోడుగా నిలుస్తున్నది. 

జేఈఈ, నీట్ కోచింగ్కు.. అలఖ్ ఏఐ
మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం జేఈఈ, నీట్, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ వంటి ప్రవేశ పరీక్షలకు అతి తక్కువ ఖర్చుతో, సులభంగా కోచింగ్ అందించేందుకు ఫిజిక్స్ వాలా అనే సంస్థ ‘అలఖ్ ఏఐ సూట్’ అనే టూల్ రూపొందించింది. పేదవారికి, రిమోట్ ఏరియాల్లో ఉండే విద్యార్థులకు అందుబాటులోనే తక్కువ ఖర్చుతో చదువు చెప్పించేందుకు ఇది సహాయపడుతున్నది. దీనికి ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సహకారం అందిస్తున్నది. ఇందులో జేఈఈ, నీట్ వంటి  పరీక్షలకు ఏడాదికి రూ.4,200 నుంచి రూ.4,500 వరకు చార్జ్ చేస్తున్నారు. టీచర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో క్లాస్ రూమ్ ఎక్స్​పీరియన్స్ అందించేలా హైబ్రిడ్ మోడ్​లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. క్లాస్​రూమ్​లో విద్యార్థులుంటే సుదూర ప్రాంతంలో టీచర్లున్నా ఏఐ మోడల్ ద్వారా క్లాసులు చెబుతున్నారు.

అలఖ్ ఏఐ టూల్​లో ఏఐ గురు, స్మార్ట్ డౌట్ ఇంజన్ అనే టూల్స్ ఉంటాయి. వీటిలో ఏఐ గురు టూల్ వ్యక్తిగత ట్యూటర్​గా విద్యార్థికి గైడెన్స్ ఇస్తుంది. విద్యార్థి సామర్థ్యాలకు అనుగుణంగా కంటెంట్ క్రియేట్ చేసి సబ్జెక్టును నేర్పిస్తుంది. స్మార్ట్ డౌట్ ఇంజన్ టూల్ విద్యార్థికి ఏదైనా సబ్జెక్టులో డౌట్లుంటే క్లియర్ చేస్తుంది. లైవ్ క్లాసుల్లోనే విద్యార్థి తన డౌట్లను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. వీటికి అదనంగా ఏఐ గ్రేడర్, సహాయక్ అనే మరో రెండు ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇవి విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం మ్యాథ్స్, సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) సబ్జెక్టులపైనే ఇందులో ట్రైనింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సబ్జెక్టులకు విస్తరించేందుకు మైక్రోసాఫ్ట్, ఫిజిక్స్ వాలా కసరత్తు  చేస్తున్నాయి. 

ఇండియన్ ఏఐ.. పర్ ప్లెక్సిటీ 
ఏఐ అనగానే ప్రస్తుతం గుర్తొచ్చేది ఓపెన్​ఏఐ సంస్థ తెచ్చిన చాట్​జీపీటీ, గూగుల్ కంపెనీ తెచ్చిన జెమినీ ఏఐలే. కానీ వాటికి దీటుగా అరవింద్ శ్రీనివాస్ అనే ఇండియన్ పర్​ప్లెక్సిటీ ఏఐ అనే సంస్థను స్థాపించారు. ఈ టూల్ కేవలం 3 నిమిషాల్లోనే అన్ని టాస్కులను  కంప్లీట్ చేస్తుందని చెబుతున్నారు. ప్రో యూజర్లు రోజూ 500 క్వశ్చన్లకు ఈ ఏఐ టూల్ ద్వారా సమాధానాలను తెలుసుకోవచ్చు. ఫ్రీ యూజర్లకు మాత్రం ఇది పరిమితంగా పని చేస్తుంది.

ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ సహా అనేక అంశాలపై ఎక్స్​పర్ట్​ లెవెల్ అనాలిసిస్​ను ఇది అందిస్తుంది. ఓపెన్ ఏఐతో పోలిస్తే కచ్చితత్వంలో తక్కువే అయినా.. చాలా తక్కువ ఖర్చుతో వేగంగా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అరవింద్​ శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ డీప్ రీసెర్చ్ టూల్ ను ఓపెన్​ ఏఐ అధిపతి శామ్ ఆల్ట్​మన్ సైతం మెచ్చుకోవడం విశేషం. 

బ్రేకప్ అయిన గర్ల్స్కు.. ఏఐ బాయ్​ఫ్రెండ్స్  
లవ్ బ్రేకప్ అయితే చాలా మంది బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఒక్కసారిగా ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్లోకి వెళ్లిపోతారు. అయితే, ఇప్పుడు అమ్మాయిలకు అలాంటి ఫీలింగ్​రాకుండా ఏఐ బాయ్​ఫ్రెండ్స్ తోడుగా ఉంటున్నారు. చైనాకు చెందిన పేపర్ గేమ్స్ అనే సంస్థ ఆ దేశంలో బ్రేకప్ అయిన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఈ ఏఐ బాయ్​ఫ్రెండ్స్​ను తీసుకొచ్చింది. లవ్ అండ్ డీప్​స్పేస్​గా పిలుస్తున్న దీనిని ఓ గేమ్​లాగా 2024లో రూపొందించారు. అందులో రిజిస్టర్ అయిన అమ్మాయిల కోసం ఐదు మేల్ క్యారెక్టర్లను ఇందులో డెవలప్​ చేశారు. అమ్మాయిలు వారికి నచ్చిన క్యారెక్టర్ ఆధారంగా ఆ ఏఐ బాయ్​ఫ్రెండ్​తో మాట్లాడుకోవచ్చు. అమ్మాయిలు తమ  బాధలు చెప్పుకుంటే ఆ ఏఐ బాయ్​ఫ్రెండ్ ఓదార్చి, సలహాలు ఇస్తుంటాడట.

ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు.. ఏఐ వాటర్​వర్త్​  
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ‘ప్రాజెక్ట్ వాటర్​వర్త్’ పేరుతో మెటా సంస్థ సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా ప్రపంచమంతటికీ ఏఐ ఆధారిత సబ్​సీ కేబుల్ (సముద్ర గర్భం నుంచి ఇంటర్నెట్ కేబుల్స్) మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇండియా సహా వివిధ దేశాలను ఈ ఏఐ ఆధారిత వాటర్​వర్త్ ప్రాజెక్ట్ ద్వారా కనెక్ట్ చేస్తారని సంస్థ తెలిపింది. సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల లోతులో 50 వేల కిలోమీటర్ల పొడవునా.. ఐదు ఖండాల్లో దీనిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

సముద్ర గర్భంలో వేసిన కేబుల్స్ పనితీరును ఎప్పటికప్పుడు ఏఐ ద్వారా బేరీజు వేసుకుంటూ కనెక్టివిటీలో అంతరాయాలు కలగకుండా చేస్తారని చెబుతున్నారు. ఇండియా, బ్రెజిల్, అమెరికా, సౌతాఫ్రికా సహా వివిధ దేశాలకు దీని ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందకు మెటా కసరత్తు చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ప్రపంచానికే ఇండియా డిజిటల్ హబ్గా మారుతుందని అంటున్నారు.