బెంగళూరులోని AI స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో సుచనా సేథ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కొడుకును గోవా తీసుకెళ్లి మరీ చంపి.. ఆ తర్వాత బ్యాగులో కుమారుడి శవంతో.. బెంగళూరు వెళుతూ పట్టుబడిన సుచనను విచారిస్తున్నారు గోవా పోలీసులు. విచారణలో ఆమె చెప్పిన విషయాలతో పోలీసులే షాక్ అయ్యారు..
ఐటీ ప్రొఫెషనల్ అయిన సుచనా సేథ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది. ఫౌండర్, సీఈవో ఆమెను.. సుచనకు 2010లో పెళ్లయ్యింది.. 2019లో వీరికి ఓ కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో 2020లో భర్త నుంచి విడాకులు తీసుకున్నది సుచనా. ఆ తర్వాత ఏఐకి సంబంధించి కంపెనీని పెట్టుకున్నది. కోర్టు ఆదేశాలతో వారంలో ఒక రోజు కుమారుడిని కలవటానికి.. తన మాజీ భర్తకు అనుమతి ఉంది. అయితే తన మాజీ భర్త.. తన కుమారుడిని చూడటాన్ని, కలవటాన్ని సహించలేకపోయింది సుచనా..
ఈ క్రమంలోనే కుమారుడిని చూడటానికి భర్త వస్తున్నాడనే విషయం తెలిసి.. కుమారుడితో కలిసి బెంగళూరు నుంచి గోవా వెళ్లింది సుచనా.. అక్కడే తీవ్ర ఒత్తిడిలో.. గెస్ట్ హౌస్ లోనే తన కుమారుడిని.. తన చేతులతో చంపేసింది. ఆ తర్వాత కుమారుడి శవాన్ని పెద్ద బ్యాగులో పెట్టుకుని.. క్యాబ్ బుక్ చేసుకుని.. బెంగళూరు బయలుదేరింది. హోటల్ గదిలో దిగినప్పుడు ఉన్న కుమారుడు.. వెళ్లే సమయంలో లేకపోవటం.. గదిలో రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లు గుర్తించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. దారి మధ్యలోనే క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి.. పట్టుకున్నారు పోలీసులు.
మాజీ భర్త.. తన కుమారుడిని చూడటం, కలవటం ఇష్టం లేక ఈ పని చేసినట్లు ఒప్పుకోవటం సంచలనంగా మారింది. ఈ మహిళా సీఈవో తీవ్ర ఒత్తిడిలో ఉందని.. టెన్షన్ గా ఉందని.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి కొడుకును చంపటం చూస్తుంటే.. ఆమె మానసిక పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు..