వాట్సాప్‌లో ఏఐ స్టిక్కర్స్
వాట్సాప్‌లో మరో కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే... ఏఐ సాయంతో వాట్సాప్ లోనే స్టిక్కర్లు తయారు చేసుకోవచ్చట. కానీ, ఇప్పటికైతే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే. ఈ ఫీచర్ సాయంతో ఏఐను ఉపయోగించి అప్పటికప్పుడు వాట్సాప్‌లో మనకు అవసరమైన సొంత స్టిక్కర్ రెడీ చేసుకోవచ్చన్నమాట. అయితే, అందుకు అవసరమైన కమాండ్స్ మనమే ఇవ్వాలి. సందర్భాన్ని బట్టి స్టిక్కర్లు డిజైన్ చేసి పంపిస్తే అవతలి వ్యక్తికి తేలిగ్గా అర్థం అవుతాయి. ఈ ఫీచర్ స్టిక్కర్ ప్యాలెట్‌లో కనిపిస్తుంది.
ఇందుకు అవసరమైన టెక్నాలజీ సపోర్ట్ మెటా అందిస్తుంది. అయితే, వాట్సాప్ ఏ ‘ఏఐ’ మోడల్ వాడుతుందనే విషయం ఇంకా తెలియదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న స్టిక్కర్ ఫీచర్ త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.
గూగుల్ ఫొటోస్ మెమొరీస్‌గా..
గూగుల్ ఫొటోస్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. దాని పేరు ‘హెల్ప్ మి టైటిల్’. ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇమేజ్ కంటెంట్‌కి టైటిల్ పెట్టుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. కావాలంటే దీనికి ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుందో హింట్ కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు.. పారిస్ ట్రిప్‌కి వెళ్లిన ఫొటోస్ కలెక్షన్ ఉందనుకుంటే.. వాటికి టైటిల్ ‘రొమాంటిక్’ లేదా ‘అడ్వెంచర్’ అని హింట్ ఇవ్వొచ్చు.
అప్పుడు అది ‘ఎ రొమాంటిక్ గేట్‌వే ఇన్ పారిస్’ లేదా ‘యాన్ అడ్వెంచర్ ఇన్ ది సిటీ ఆఫ్ లైట్స్’ వంటి టైటిల్స్ ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ యుఎస్ఎలో ఉంది. కొన్ని నెలల్లోనే మన దగ్గర కూడా రాబోతోంది. అలాగే ఇందులో మెమొరీస్‌గా వచ్చేలా వీడియో ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా యాడ్ చేస్తారట. కాబట్టి వాటిని వేరే ప్లాట్‌ఫామ్‌లకు ఈజీగా షేర్ చేసుకోవచ్చు కూడా.