
సియోల్: నార్త్ కొరియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో కూడిన సూసైడ్(ఆత్మాహుతి) డ్రోన్‌లను తయారు చేసింది. భూమిపై, సముద్రంలో వివిధ వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యమున్న ఈ సరికొత్త డ్రోన్‌ల పరీక్షను నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పరిశీలించారని అక్కడి అధికారిక మీడియా గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." ఆయుధ అభివృద్ధిలో యూఏవీలకు, ఏఐకి ప్రాధాన్యమివ్వాలి" అని అధికారులకు సూచించారు.
ఏఐ ఆధారిత ఆయుధాల ఉత్పత్తిని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియా విడుదల చేసింది. అందులో కిమ్ ఒక పెద్ద డ్రోన్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపించాడు. అది బోయింగ్ ఈ-7 వెడ్జ్‌టైల్ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానాన్ని పోలి ఉంది. సైనిక వాహనాలే లక్ష్యంగా డ్రోన్‌లు అటాక్ చేస్తున్నట్లు ఫొటోల్లో కనిపించింది. గతేడాది నవంబర్, ఆగస్టులోనూ ఇలాంటి డ్రోన్ల ప్రదర్శనలను కిమ్ పరిశీలించారని మీడియా తెలిపింది.