
- పైలట్ ప్రాజెక్ట్ లో 6 ప్రైమరీ స్కూళ్లు
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాచలం,వెలుగు : సర్కారు స్కూళ్లలో ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ద్వారా టీచింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం తాతగుడి సెంటర్, బూర్గంపాడు, అంజనాపురం, మోరంపల్లి బంజర, నాగినేనిప్రోలు, సారపాక గాంధీనగర్ ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేయగా.. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం ఈ టీచింగ్‌ను ప్రారంభించారు.
3,4,5 క్లాస్ స్టూడెంట్లు తెలుగు బాగా చదివేలా, మ్యాథ్స్ లో పట్టుసాధించేలా చూడటం ఈ ప్రోగ్రాం ఉద్దేశం. బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ అనే సంస్థతో తెలంగాణ సర్కారు అగ్రిమెంట్ చేసుకుంది. ఈ సంస్థ తమిళనాడులో చేపట్టిన ప్రోగ్రాం సక్సెస్ అయ్యిందని అధికారులు
తెలిపారు.
వెనుకబడిన స్టూడెంట్లకు...
3,4,5 క్లాసుల్లో వెనుకబడిన ఐదుగురు స్టూడెంట్లతో ఒక బ్యాచ్‌ను ఎంపిక చేస్తారు. ఒక్కో బ్యాచ్‌కు తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 20 నిముషాల వ్యవథిలో ఏఐ ద్వారా కంప్యూటర్లో టీచ్ చేస్తారు. ఇందుకు ప్రతీ అరగంటకు ఒక బ్యాచ్ చొప్పున స్పెషల్ క్లాసులు ఉంటాయి. ప్రతీ స్టూడెంట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి సామర్ధ్యాలను పెంచుతారు.
ఈ మేరకు ఆయా పాఠశాలల పరిధిలోని పేరెంట్స్ తో మీటింగ్ నిర్వహించి వారి సాయం కూడా తీసుకుంటున్నారు. ఇంటి వద్ద కూడా పిల్లలను చదివించేలా వారికి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాచలంలోని తాతగుడి సెంటర్లోని ప్రైమరీ స్కూళ్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో దిశా నిర్ధేశం చేశారు. టీచర్లు, పేరెంట్స్ సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఈ స్కీం విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు.