- పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు చర్యలు: పొంగులేటి
- చెల్లింపుల్లో జాప్యం నివారణకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం
- సాంక్షన్ అయిన ఇండ్లను వెంటనే స్టార్ట్ చేయాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అక్రమాలకు, అవినీతికి తావులేకుండా నిజమైన లబ్ధిదారులకే మేలు చేకూరేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్‌ను రూపొందించి సర్వే పూర్తి చేశామన్నారు.
ఇండ్ల నిర్మాణం, చెల్లింపులలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని వాడుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బుధవారం సెక్రటేరియట్లో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, ఐటీ శాఖకు చెందిన పలువురు అధికారులతో కలిసి మంత్రి రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలను క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీ సాయంతో సరిపోలుస్తూ అనర్హులను తొలగించి, అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చేస్తామని, ఈ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా కూడా ఏఐని వాడుకోవాలని చెప్పారు. దీనివల్ల రాజకీయ ప్రమేయానికి కూడా తావు లేకుండా చూడొచ్చన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా 72 వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందజేశామని, వీరి ఇండ్ల పనులు వెంటనే స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలివిడత ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.