-
డిజైన్లలో ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్లాన్
-
సౌత్ పార్ట్‌లో ఎక్కువగా వినియోగం
-
ఏఐ ఎక్స్‌పర్ట్స్‌తో త్వరలో కమిటీ ఏర్పాటు
-
చివరి దశకు చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నార్త్ పార్ట్, సౌత్ పార్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వాడనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న జియో ట్యాగింగ్, ఇంటర్ చేంజర్స్, క్రాస్ ఓవర్స్ డిజైన్లలో ఏఐ కీలక పాత్ర పోషించనున్నది. రెండు సైడ్ల నిర్మాణాల పర్యవేక్షణ కోసం డ్రోన్ ద్వారా ఏఐ టెక్నాలజీని వినియోగించుకునేలా సర్కారు ప్లాన్ చేసినట్టు సమాచారం. 20 టౌన్లు, 125 గ్రామాలు, 17 స్టేట్, నేషనల్ హైవేస్‌ను కనెక్ట్ చేస్తూ ట్రిపుల్ఆర్ రెండు పార్ట్స్‌లో రూట్ల నిర్మాణం జరగనున్నది.
రాష్ట్ర పరిధిలోని గత రోడ్లకు వినూత్న రీతిలో ఏఐను వినియోగించుకోనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో ఏఐపై జరిగిన సెమినార్లో ఈ ప్రాజెక్టుపై చర్చ సాగింది. ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో నిర్మించనున్న నార్త్ పార్ట్‌కు భూసేకరణ చివరి దశకు చేరుకోగా.. త్వరలో రైతులకు చెల్లించే పరిహారంపై అవార్డ్ పాస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన తర్వాత ఏఐ నిపుణులతో అధికారులు భేటీ అయి, ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న అంశంపై చర్చలు జరిపి పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
సౌత్ పార్ట్ పనులు షురూ
ట్రిపుల్ఆర్ సౌత్ పార్ట్ నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ దగ్గర మొదలై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డి వద్ద ప్రారంభమయ్యే ఉత్తర భాగానికి అనుసంధానమవుతుంది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా నల్గొండ జిల్లా చౌటుప్పల్ వరకు ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ 189.20 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నది.
భూ పరిహారం కింద రూ.7 వేల కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉండగా.. మొత్తం రోడ్డు నిర్మాణానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయని అధికారుల ప్రాథమిక అంచనాల్లో తేలినట్టు సమాచారం. ట్రిపుల్ఆర్ సౌత్ పార్ట్ అలైన్‌మెంటుపై ఇప్పటికే కసరత్తులు వేగంగా చేస్తున్న నేషనల్ హైవే.. తెలంగాణ ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని ఫీల్డ్ లెవల్లో పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు 4 వేల ఎకరాల భూములను సేకరించనున్నారు. జియో ట్యాగింగ్, ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ తదితర అంశాలన్నీ ఏఐతో చేయనున్నారు.
దాని కోసం ఒక నిపుణుల టీంను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏఐ ఎక్స్పర్ట్స్ తో.. ఇంజినీరింగ్ డిజైనింగ్ టీం కూడా సమావేశం కానున్నట్టు తెలిసింది. తొందరలోనే ఈ మీటింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నార్త్ పార్ట్ సర్వే, భూసేకరణ సంబంధిత అంశాలు ముగిసినందున కేవలం నిర్మాణంలో మాత్రం ఇక్కడ ఏఐని వినియోగించనుండగా.. సౌత్ పార్ట్‌లో మాత్రం జియో ట్యాగింగ్, సర్వే, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడనున్నట్టు సమాచారం. అయితే, తొందరలోనే ఈ మార్గమంతా జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారులు అందుకు అవసరమైన కసరత్తులు ఏఐ వినియోగించే చేశారు. నాగ్ పూర్ కు చెందిన ఒక నియమిత కన్సల్టెన్సీ ఈ ప్రక్రియను చేపట్టింది.
ఆ తర్వాతే సౌత్ పార్ట్ భూసేకరణ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తుండగా.. అనంతరం ట్రిపుల్ఆర్నిర్మాణ సంబంధిత పనుల్లో వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించి సౌత్ పార్ట్రోడ్డు మొత్తాన్ని అధికారులు జియో ట్యాగింగ్ చేస్తుండగా, ఆ మార్గంలో విద్యుత్ లైన్లు, గుర్తించిన, గుర్తించబడని చెరువులు, కుంటలు, అటవీ భూములు, చెట్లు, గుట్టలు.. ఇలా ప్రతి దానికి సంబంధించిన సమాచారం ఏఐ టెక్నాలజీతో సేకరించనున్నారు. ఈ ప్రక్రియలో స్థానిక నీటిపారుదల, అటవీ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సమన్వయం చేసుకొని, ముందుకు సాగుతారు. ప్రధానంగా యుటిలిటీస్గుర్తించి, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపైనే దృష్టిసారిస్తారు. ట్రిపుల్ఆర్ సౌత్ పార్ట్ 189.2 కిలోమీటర్ల వరకు ఉండగా, యుటీలిటీస్ ఇతర వివరాలను గుర్తించేందుకు ప్రతి 10 కిలోమీటర్లకు ఒక టీంను ఏర్పాటు చేయనున్నారు.
3 నమూనాల్లో సౌత్ పార్ట్ అలైన్‌మెంట్
ట్రిపుల్ఆర్కు సంబంధించి ప్రభుత్వం ఉత్తరభాగం పనులతో సమాంతరంగా దక్షిణ భాగానికి సంబంధించిన వర్క్స్‌ను చేపడుతున్నది. అయితే, సౌత్ పార్టుకు సంబంధించి రైతులు సాగు చేయని భూముల మీదుగా అలైన్ మెంట్ వేళ్లేలా పరిశీలించాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. సాగేతర భూములు అధికంగా వాడాలని నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో.. వాటిపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారు.
రైతులు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు లేకుండా.. సాగేతర, అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రావని సర్కారు భావిస్తున్నది. అందుకోసం సౌత్ పార్ట్ అలైన్‌మెంట్‌ను 3 నమూనాల్లో అధికారులు సిద్ధం చేశారు. ఈ మూడు నమూనాల్లో ప్రాంతాలు మారనుండడంతోపాటు ఆ మార్గంలో సాగు, సాగేతర, అటవీ, అటవీయేతర భూములు ఎంతమేర ఉంటాయనే అన్ని వివరాలను పొందుపరచనున్నారు.
సాగేతర భూములను ఏఐ టెక్నాలజీ టీం.. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి తేల్చనున్నట్టు తెలిసింది. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్ సహా వివిధ అంశాలను స్టడీ చేసేందుకు ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్ అండ్ టెక్నోకార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నది.