- నది సుందరీకరణ తర్వాత అణువణువూ మానిటర్ చేసేలా వ్యవస్థ
- రూపొందించిన ఐదుగురు అమ్మాయిల సీబీఐటీ టీమ్
- సహకారం అందించిన తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్
- ఏఐ గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘ఏఐ పవర్డ్ మూసీ రివర్ మోడల్’
హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణ.. రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడ్తున్న ప్రాజెక్ట్ ఇది. లండన్‌లోని థేమ్స్ నదిలా మూసీని సుందరంగా మార్చి.. నది ఒడ్డుపొంటి వ్యాపార సముదాయాలు, రీక్రియేషన్ హబ్‌లు, ప్రజలు సేద తీరేలా పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అసలు అతిపెద్ద టాస్క్ మూసీని క్లీన్ చేయడమే. క్లీన్ చేసినా మళ్లీ మూసీలోకి డ్రైనేజీ రాకుండా మానిటర్ చేయడం మరో పెద్ద టాస్క్. ఈ టాస్క్‌ను సులువు చేసేలా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) సహకారంతో సీబీఐటీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు ‘ఏఐ సొల్యూషన్’ను చూపించారు.
నది ఎక్కడ పొల్యూట్ అవుతుందో తెలుసుకుని అప్పటికప్పుడు, అక్కడికక్కడే ఆ సమస్యను ఏఐ టూల్స్‌తో పరిష్కరించే ఐడియాను చూపించారు. మూసీ వాటర్‌ను అనుక్షణం మానిటర్ చేసే ఏఐ సొల్యూషన్‌తో ముందుకొచ్చారు. సీబీఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న మేఘన, మమత, సాహితి, శ్రీయ, చరిష్మా అనే ఐదుగురు సభ్యుల ఆల్ గర్ల్స్ టీమ్.. ఏఐ సాంకేతికతతో మూసీ రివర్ క్లీనింగ్‌పై ప్రాజెక్ట్‌ను చేశారు.
రెజువనేట్ చేసిన మూసీ మళ్లీ కలుషితం కాకుండా ఏఐ టూల్స్‌తో పరిష్కారం చూపించొచ్చని ఆ టీమ్ సభ్యులు చెప్తున్నారు. సీబీఐటీ విద్యార్థుల ఐడియా నచ్చిన టీజీటీఎస్.. వారికి సంపూర్ణంగా సహకారం అందించింది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు టీజీటీఎస్ సిద్ధమవుతున్నది. దీనిపై గురువారం ఏఐ గ్లోబల్ సమిట్‌లో ‘ఏఐ పవర్డ్ మూసీ రివర్ మోడల్’ను ప్రదర్శించారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నదిలో సెన్సార్లు
మూసీ నది సుందరీకరణ పూర్తయిన తర్వాత వివిధ అంశాల్లో ఏఐతో మూసీని పర్యవేక్షించేలా ఏఐ టూల్స్‌ను సీబీఐటీ స్టూడెంట్స్ రూపొందించారు. మూసీ నదిపై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ప్రెడిక్టివ్ మోడలింగ్, ఫ్లడ్ ప్రెడిక్షన్, డేటా కలెక్షన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంపాక్ట్‌ను ఏఐతో తెలుసుకునేలా మోడల్స్‌ను తయారు చేశారు. డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి.. ఆప్టిమైజ్డ్ ల్యాండ్ యూసేజ్, ట్రాఫిక్, రెజువనేషన్ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ట్రాన్స్పోర్ట్ యాక్సెసబిలిటీ, కరెంట్ ఎక్కువ కాలకుండా చూసే సమర్థవంతమైన ఇంట్రా డిజైన్లను ఏఐ ద్వారా మానిటర్ చేస్తారు. నిర్మాణ దశలో భాగంగా ఏఐ ఆధారిత నిర్మాణ నిర్వహణ, ప్రాజెక్ట్ షెడ్యూల్, వనరుల నిర్వహణ, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ మానిటరింగ్, భద్రతా పర్యవేక్షణ వంటి వాటిని ఈ ఏఐ టూల్స్‌తో మానిటరింగ్ చేసేందుకు వీలుంటుంది.
పర్యావరణ పరిరక్షణకూ దోహదం మూసీని సుందరీకరించాక ఆ నీళ్లు
మళ్లీ కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నది మొదలయ్యే స్థానం నుంచి సిటీలో చివరి అంచు వరకు సెన్సర్లను ఏర్పాటు చేస్తారు. ఈ సెన్సర్లు నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థకు పంపిస్తుంటుంది. కొంచెం తేడా వచ్చినా సిస్టమ్‌ను అలర్ట్ చేస్తుంది. అంతేగాకుండా నీటిని పంట పొలాలకు వృథా పోకుండా వాడుకునేలా స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఈ ప్రాజెక్ట్ సొంతం. మూసీ నదిలో జీవ వైవిధ్యాన్నీ ఎప్పటికప్పుడు పర్యవే క్షించేందుకు ఈ ఏఐ టూల్స్ ఉపయో గపడతాయి. అంతేగాకుండా ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు..
వాళ్ల ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఏమిటి.. అనేది తెలుసుకునేందుకూ ఈ ఏఐ టూల్ దోహదం చేస్తుందని విద్యార్థులు వివరించారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక.. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి మెయింటెనెన్స్నూ ఈ ఏఐ టూల్ ద్వారా చేయొచ్చని చెప్తున్నారు. ప్రాజెక్ట్ నాణ్యతా ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని అంటున్నారు. మూసీ సుందరీకరణ తర్వాత వచ్చిపోయే పర్యా టకులతో చెత్త చెదారం పేరుకుపోతుం టుంది.. అలాంటి వ్యర్థాల నిర్వహణనూ ఎప్పటికప్పుడు దీని ద్వారా మానిటర్ చేసేందుకు వీలుంటుంది. వచ్చి పోయే టూరిస్టుల నిర్వహణ, వారి సంఖ్యనూ తెలుసుకునేందుకు సీబీఐటీ స్టూడెంట్స్ తయారు చేసిన ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి..