- సెకండ్ లిస్టులో 4 సెగ్మెంట్లకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్
- కోరుట్లకు జువ్వాడి, చొప్పదండికి మేడిపల్లి, హుజూరాబాద్‌కు
- ప్రణవ్ పేర్లు ఖరారు పెండింగ్‌లో కరీంనగర్, సిరిసిల్ల సీట్లు
- ఇప్పటిదాకా 11 స్థానాలకు అభ్యర్థులు ఓకే
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో నాలుగు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేసింది. హుస్నాబాద్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, కోరుట్లకు జువ్వాడి నర్సింగారావు, చొప్పదండికి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌కు వొడితల ప్రణవ్‌ను ఏఐసీసీ ప్రకటించింది. వీరిలో ప్రణవ్ మినహా మిగతా ముగ్గురు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారే కావడం విశేషం. ఈ నెల 15న ప్రకటించిన ఫస్టు లిస్టులో టికెట్లు కన్ఫామైన ఏడుగురితో కలిపితే ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు గానూ 11 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు క్యాండిడేట్లను డిక్లేర్ చేయాల్సి ఉంది.
పొన్నం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు..
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా, 2019 లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఎంపీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నంకు ఎక్కువ ఓట్లు రావడం, అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి అక్కడి నుంచే పోటీచేస్తానని పట్టుబట్టారు. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ కోసం పోటీ పడిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాదని పొన్నంకు హైకమాండ్టికెట్ కేటాయించింది.
హుజూరాబాద్‌లో యువనేత ప్రణవ్ ..
హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్‌ను ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఈ నెల 6న వొడితెల ప్రణవ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో సీన్ మారిపోయింది. హుజూరాబాద్‌లో 2 నెలల కింద ప్రణవ్తాత సింగాపురం రాజేశ్వర్‌రావు విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రణవ్సుమారు 5 వేల మందిని సమీకరించారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే రాజేశ్వర్‌రావు విగ్రహావిష్కరణను గ్రాండ్‌గా నిర్వహించారనే టాక్ అప్పట్లో వచ్చింది. అయితే ఆయన తాత రాజేశ్వర్‌రావు సోదరుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి ప్రణవ్ కు పొలిటికల్‌గా సపోర్ట్ లేనందునే ప్రణవ్కాంగ్రెస్ లో చేరినట్లు తెలిసింది. మరోవైపు బల్మూరి వెంకట్ స్థానికుడు కాకపోవడం, హుజూరాబాద్‌లో వొడితల కుటుంబానికి ఆదరణ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ప్రణవ్ వైపే మొగ్గింది.
చొప్పదండి నుంచి మరోసారి మేడిపల్లి..
చొప్పదండి అభ్యర్థిగా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం బరిలో నిలవబోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆయన అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగె శోభ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతిలో ఓడిపోయారు. చొప్పదండిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన సత్యం.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కోరుట్ల అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావు..
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జువ్వాడి నర్సింగరావు కోరుట్ల నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు. ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు భార్య మాజీ ఎమ్మెల్యే జ్యోతిదేవి, కుమారుడు కరం చంద్‌తోపాటు కల్వకుంట్ల సుజిత్ రావు,
కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడ్డారు. చివరికి హైకమాండ్జువ్వాడి నర్సింగరావుకు టికెట్ ఇచ్చింది.
కరీంనగర్, సిరిసిల్లకు ఖరారు కాలే
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ కరీంనగర్, సిరిసిల్ల స్థానాలను పెండింగ్ లో పెట్టింది. కరీంనగర్ నుంచి 15 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ప్రధానంగా మొన్నటి వరకు మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు, బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ మధ్యే పోటీ నెలకొంది.
అయితే గురువారం మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పార్టీలో చేరికతో వీరికి మరొకరు యాడ్ అయ్యారు. సెకండ్ లిస్టులోనే సంతోష్ కుమార్ పేరు వస్తుందనే ఊహగానాలు వినిపించాయి. తీరా లిస్టు చూస్తే ఆయన పేరు కనిపించలేదు. మరోవైపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు పోటీగా కేకే మహేందర్‌రెడ్డికి టికెట్వస్తుందని అంతా భావించినప్పటికీ.. పెండింగ్ లో పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.