సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. డిప్యూటీ సీఎం భట్టి కూడా..

  • డిప్యూటీ సీఎం, దీపాదాస్ కూడా
  • ఏఐసీసీ పిలుపుతో పయనం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షి కూడా అదే విమానంలో హస్తిన పయనమవుతున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతోనే వీళ్లు ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. రేపు ఉదయం ఏఐసీసీ నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం.

ఆరు గ్యారెంటీల అమలు అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఏఐసీసీ నేతలకు వివరించనున్నారు. సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహం అంశాన్ని ఏఐసీసీకి సీఎం వివరించనున్నారు. వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారని సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితిని ఏఐసీసీ పెద్దలకు వివరిస్తారని సమాచారం.