హెడ్ మాస్టర్‎లా వ్యవహరిస్తున్నారు.. సభలో అతిపెద్ద డిస్టబెన్స్ చైర్మనే: AICC చీఫ్ ఖర్గే ఫైర్

హెడ్ మాస్టర్‎లా వ్యవహరిస్తున్నారు.. సభలో అతిపెద్ద డిస్టబెన్స్ చైర్మనే: AICC చీఫ్ ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: రాజ్య సభలో అతిపెద్ద డిస్టబెన్స్ చైర్మన్ జగదీప్ ధన్కడేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్య సభ చైర్మన్‎పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి గల కారణాలను బుధవారం (డిసెంబర్ 11) ఖర్గే మీడియాకు వివరించారు. రాజ్యసభలో ఏర్పడుతోన్న అంతరాయాలకు అతిపెద్ద కారణం చైర్మన్ ధన్కడేనని.. సభలో ఆయన స్కూల్ హెడ్ మాస్టర్‎లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సభలో బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ.. విపక్షాలకు చెందిన సీనియర్ ఎంపీలను దూషిస్తున్నారని మండిపడ్డారు.

 రాజ్యసభ ఛైర్మన్‌పై తమకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరో మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 1952 నుండి ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏదీ ప్రవేశపెట్టలేదని.. ఎందుకంటే ఆ పదవిలో ఉన్నవారు ఎవరూ ధన్కడ్‎లా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా నిబంధనల ప్రకారం సభను నడిపారని గుర్తు చేశారు. ధన్కడ్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. బీజేపీ అధికార ప్రతినిధిలా నడుచుకుంటున్నారని.. అందుకే దేశ చరిత్రలో తొలిసారిగా తప్పని పరిస్థితుల్లో రాజ్య సభ చైర్మన్‎ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. 

ALSO READ | మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. శివసేనకు గుండె పగిలే వార్త చెప్పిన బీజేపీ లీడర్..!

కాగా, బీజేపీ తొత్తులా వ్యవహిస్తు్న్నారని.. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్‎పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత్వత్వంలోని ఇండియా కూటమి తీసుకువచ్చిన ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్‎కు కూటమిలోని టీఎంసీ, ఆప్, ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే, సంఖ్యా బలం ప్రకారం ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకుంటే సభలో ఇండియా కూటమికి మెజార్టీ లేదు. రాజ్యసభలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు 121 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్షాలకు 86 మంది సభ్యులున్నారు. న్యూట్రల్‎గా ఉన్న  వైఎస్‌ఆర్‌సీపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే, బీఆర్‌ఎస్‌, బీఎస్పీ వంటి పొత్తులేని పార్టీలకు రాజ్య సభలో మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు.