ఎప్పటికైనా బీజేపీ, RSS అంబేద్కర్‎కు శత్రువులే.. ప్రధాని మోడీకి ఖర్గే కౌంటర్

ఎప్పటికైనా బీజేపీ, RSS అంబేద్కర్‎కు శత్రువులే.. ప్రధాని మోడీకి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం (ఏప్రిల్ 14) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికైనా.. బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ డా. బీఆర్ అంబేద్కర్‎కు శత్రువులేనని అన్నారు. జీవించి ఉన్నప్పుడు కూడీ బీజేపీ ఆయనకు మద్దతు ఇవ్వకుండా.. కులం పేరుతో అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్ బౌద్దమతాన్ని స్వీకరించినప్పుడు.. ఆయన దళిత మహర్ సమాజానికి చెందినవాడని.. ఒక అంటరానివాడని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు అవమానించారు. అంబేద్కర్ బౌద్దమతం స్వీకరించి బుద్దుడిని కూడా అంటరానివాడిగా మార్చారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు అన్నారని ఆరోపించారు. 

ఇక, అంబేద్కర్‎ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్న మోడీ కామెంట్స్‎కు కూడా ఖర్గే ధీటుగా బదులిచ్చారు. బాబా సాహెబ్ రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ. హిందూ మహాసభ ఆయనకు వ్యతిరేకంగా ఉంది. హిందు మత సభ వ్యతిరేకత వల్ల ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని.. అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మోడీ సర్కార్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ పేరును వాడుకుంటుంది. కానీ ఆయన ఆశయాలు, ఆక్షాంశలను బీజేపీ ఎప్పటికీ నేరవేర్చదని అన్నారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి.. ఏ వర్గం వారు ఎంత ఉన్నారో వాళ్లకు ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కానీ కులగణనకు బీజేపీ సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. 

Also Read :- అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు

అంతకుముందు హర్యానాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దార్శనికతకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడిన అంబేద్కర్ ఆదర్శాలను తుంగలో తొక్కి.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను అల్పవర్గ పౌరులుగా చూస్తోందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం కావాలని కలలు కన్నాడు.. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి ఆయన దార్శనికతను అడ్డుకుందని ధ్వజమెత్తారు. 
అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా అవమానించిందని.. చివరకు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. 

అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అధికారం కోసం ఒక ఆయుధంగా మార్చుకుందని.. తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులతో సహా ఎవరికీ ప్రయోజనం చేకూర్చడానికి కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని ఉపయోగించలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలకు పై విధంగా ఖర్గే రివర్స్ కౌంటర్ ఇచ్చారు.