
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జుల సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో ప్రతిపక్ష నేతకు విలువే లేకుండా చేశారని బీజేపీపై మండిపడ్డారు.బీజేపీ ఎన్నికల సమయంలో కొత్త పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తోందని.. ఈ తరహా మోసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలని అన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలదేనని అన్నారు.
బూత్ స్థాయి వరకు ఇంచార్జులు వెళ్లి కష్టపడి పనిచేయాలని.. పార్టీ అనుబంధ విభాగాలను భాగస్వామ్యం చేసుకుంటూ సమన్వయం చేసుకోవాలని సూచించారు ఖర్గే. క్షేత్రస్థాయికి వెళ్తేనే పార్టీకి ఉపయోగపడే కార్యకర్తలను గుర్తించగలరని.. కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే విషయంలో తొందరపాటు వద్దని అన్నారు. పార్టీ భావజాలంతో ఏకీభవించేవారినే చేర్చుకోవాలని.. లేదంటే వారు పార్టీ విడిచి వెళ్లిపోతారని అన్నారు ఖర్గే.