
- మిగులు రాష్ట్రాన్ని ఇస్తే.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసిండు: మల్లికార్జున ఖర్గే
- కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్కామ్ .. బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి
- మోదీ, కేసీఆర్ ఒక్కటై కాంగ్రెస్‌ను భయపెట్టాలని చూస్తున్నరని వ్యాఖ్య
- బంగారు తెలంగాణ అని చెప్పి బెల్టుషాపుల తెలంగాణ చేసిండు: రేవంత్
- సంగారెడ్డి, మెదక్ ఎన్నికల సభల్లో ప్రసంగం
మెదక్/సంగారెడ్డి, వెలుగు: తెలంగాణ బిడ్డల ఆకాంక్షను అర్థం చేసుకొని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే సీఎం అయిన కేసీఆర్ మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘తెలంగాణ రాగానే సోనియమ్మ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఇప్పుడు రాహుల్, ప్రియాంక గాంధీపై విమర్శలు చేస్తున్నరు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పజెప్తే కేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్పను చేసిండు’’ అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటై కాంగ్రెస్‌ను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎవరికీ భయపడబోమని అన్నారు.
‘‘బీజేపీ ఏ టీమ్ అయితే దానికి బీఆర్ఎస్ బీ టీమ్” అని దుయ్యబట్టారు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయిన ఇందిరా గాంధీ మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని, ప్రస్తుత మోదీ ప్రభుత్వం అలాంటి ఫ్యాక్టరీలను అమ్మాలని చూస్తున్నదని, దానికి సీఎం కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లూటీలు తప్ప గరీబులకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తే నాలుగింటిని అమలు చేసిందని, మరో గ్యారంటీని నవంబర్‌లో అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలుచేసి తీరుతామని ఖర్గే స్పష్టం చేశారు.
నన్ను కొనేటోడు ఈ భూమ్మీద పుట్టలేదు: రేవంత్
‘‘సీఎం కేసీఆర్నన్ను రేటెంత రెడ్డి అంటున్నడు.. నేను రాష్ట్రాన్ని కోఠిలో అమ్ముతానట.. కేసీఆర్ ఓ కచరా. జుమ్మెరాత్ బజార్లో అగ్వకు తెలంగాణను అమ్మిన కేసీఆర్.. నన్ను రేటెంత రెడ్డి అంటడా’’ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనను కొనెటోడు ఈ భూమ్మీద పుట్టలేదని అన్నారు. ‘‘బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్.. రాష్ట్రంలో మూడు వేల వైన్‌షాప్‌లు, 1,800 బార్లు, 62 వేల బెల్ట్ షాప్‌లు పెట్టించి బెల్ట్ షాపుల తెలంగాణ చేసిండు” అని విమర్శించారు. ‘‘పునాదులు సక్కగ కట్టక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే బాంబులు పెట్టి పేల్చారంటున్నరు.. బాంబులు పెడితే ఎక్కడికక్కడ పేలిపోతుంది కానీ భూమిలోకి కుంగిపోతుందా..?’’ అని ఆయన ప్రశ్నించారు.
కుంగిపోయే ప్రాజెక్ట్ లను కట్టిన కేసీ ఆర్‌ను గొప్ప సైంటిస్ట్, ఇంజినీర్ అంటూ కితాబిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ‘‘బొక్కలేస్తే గాని సక్కగ కాడు” అని కేసీఆర్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజల కష్టాలు, బాధలు చూసే సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను చూపిస్తం రమ్మని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సవాల్ విసిరితే ఇక్కడి మంత్రులు కేటీఆర్, హరీశ్ తోక ముడిచిన్రు. కర్నాటకకు వెళ్లడానికి బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్ కు రావాల్నా, ఫామ్ హౌస్‌కు రావాల్నా కేసీఆర్” అని రేవంత్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రానున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించనున్నారని, ఆయనను 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి మంత్రి మల్లారెడ్డి అని, కబ్జాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. ‘‘నన్ను ఓడగొట్టాలని హరీశ్ రావు అంటున్నడు. ఇక్కడి దమ్మేంటో ఆయనకు ప్రజలు చూపెట్టాలి. హరీశ్ రావు సంగారెడ్డిలో తిరుగుతరా.. చూస్త”అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.