మోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే పోతారు: మల్లికార్జున ఖర్గే

మోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే పోతారు: మల్లికార్జున ఖర్గే

భోపాల్: పుష్కరాల్లో భాగంగా గంగ త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే  దేశంలోని పేదరికం అంతం అవుతుందా అంటూ బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించడానికి కౌంటర్‎గా ఖర్గే విమర్శలు గుప్పించారు. సోమవారం (జనవరి 27) మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీలో పాల్గొని ఖర్గే మాట్లాడారు. 

దేశంలో పిల్లల ఆకలి చావులు, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తోంటే.. అధికారంలోని బీజేపీ నేతలు వాటిపై దృష్టి సారించకుండా.. కుంభమేళాలో స్నానాలు చేయడానికి పోటీలు పడుతున్నారని దుయ్యబట్టారు. గంగ నదిలో మునిగితే దేశంలోని పేదరికం అంతం అవుతుందా..? నిరుద్యోగం తగ్గుతుందా..? పిల్లల ఆకలి చావులు ఆగుతాయా..? అంటూ బీజేపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు ఖర్గే. కేవలం ఫొటోలు, మీడియాలో కనిపించడం కోసమే బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్ షా చాలా తప్పులు చేశారు.. వారు ఎక్కడికెళ్లిన మోక్షం లేదు.. వాళ్లిద్దరూ కచ్చితంగా నరకానికే వెళ్తారని ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘‘నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బ తీయకూడదనుకుంటున్నాను. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. కానీ గంగాలో స్నానమాచరించడం వల్ల పేదరికం తొలగిపోతుందా..? పేదలకు అన్నం దొరుకుతుందా..?  దేశంలో ఎంతో మంది పేదల పిల్లలు బడికి వెళ్లలేక ఆకలితో చనిపోతున్నారు. కార్మికులకు జీతాలు అందడం లేదు. కానీ టీవీల్లో మంచిగా కనిపించడం కోసం బీజేపీ నేతలు గంగా నదిలో మునిగేందుకు పోటీ పడుతున్నారు’’ అని విమర్శలు వర్షం కురిపించారు. మతం పేరుతో బీజేపీ చేస్తోన్న దోపిడికి కాంగ్రెస్ వ్యతిరేకమని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో దేశానికి ప్రమాదమని హాట్ కామెంట్స్ చేశారు.

ALSO READ | అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి: ‘సంవిధాన్ బచావ్’ ర్యాలీలో రాహుల్ డిమాండ్

మల్లికార్జున వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఖర్గే వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. ఖర్గే హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్క్రిప్ట్‌ను ఆయన చదివారని కౌంటర్ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలు సనాతన ధర్మంపై దాడి అని విమర్శించారు. హిందు మతాన్ని కించపర్చడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తిన సంబిత్ పాత్ర.. మరేదైనా మతం గురించి ఖర్గే ఇలాంటి మాటలు మాట్లాడగలరా..? అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలు ఖండంచదగినవని.. ఆయన కామెంట్స్ పై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.