ఒకే కేంద్రంలో ఆరుగురికి టాప్ ర్యాంక్​ఎట్లొస్తది?: ప్రియాంక గాంధీ 

ఒకే కేంద్రంలో ఆరుగురికి టాప్ ర్యాంక్​ఎట్లొస్తది?: ప్రియాంక గాంధీ 
  • నీట్ ఫలితాల్లో అవకతవకలు.. 
  • ప్రియాంక గాంధీ ఆరోపణ
  • స్టూడెంట్ల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2024 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న కంప్లైంట్లపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె..ఇప్పుడు ఫలితాల్లోనూ స్కామ్ జరిగినట్లు స్టూడెంట్లు ఆరోపిస్తున్నారని వెల్లడించారు.

ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో  పోస్టు చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నట్లు ప్రియాంక తెలిపారు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అలాగే..ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థుల సూసైడ్ ఘటనలపై ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. 

 " లక్షలాది మంది స్టూడెంట్ల గోడును ప్రభుత్వం ఎందుకు వినడం లేదు ? నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పదేపదే మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని ప్రియాంక గాంధీ నిలదీశారు. ఒకే కేంద్రంలోని ఆరుగురితో సహా 67 మంది అభ్యర్థులు ఎలా టాప్ ర్యాంక్ సాధించారనే దానిపై ఎన్టీఏ నుంచి వివరణ కోరుతూ విచారణకు డిమాండ్ చేశారు.

యువత భవిష్యత్తుతో ఆటలా..?

యువత భవిష్యత్తుతో బీజేపీ ఆటలాడుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నీట్ సహా అనేక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవినీతి ఎక్కువైందన్నారు.  దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 

అదంతా తప్పుడు ప్రచారం

కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తప్పుడు ప్రచారంగా ఎన్టీఏ కొట్టి పారేసింది. మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్​లో కనిపించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందని తెలిపింది. అందువల్ల ప్రశ్నపత్రం లీక్ కాలేదని క్లారిటీ ఇచ్చింది.