మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • అప్పులు కడుతూనే.. మంచి పాలన అందిస్తున్నం 
  • సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చి తీరుతామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై చర్చించేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్లు పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలవలేదని క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన భట్టి విక్రమార్క గురువారం తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు.

ఇందులో ఎంపీలు మల్లు రవి, చామల, కడియం కావ్య, బలరాం నాయక్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో డిప్యూటీ సీఎం చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో 64 వేల కోట్లు కట్టామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు వంద శాతం అప్పులు పెరిగి ఏడాదికి రూ.64 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుతం తాము ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనపై దృష్టి పెట్టామని, అందుకే ప్రచారంలో వెనకబడ్డామన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలకు పనేమీ లేదని, అందుకే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పదేండ్ల తర్వాత హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నామని పేర్కొన్నారు.  

తెలంగాణ తల్లికి ప్రాణం పోసినం

రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేస్తామని చెప్పామని, ఏది ఏమైనా అమలుచేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ కంటే ఎక్కువ రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని, టీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే తెలంగాణ తల్లి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ తల్లికి ప్రాణం పోసినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధనేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ నిబంధనలు మార్చారని గుర్తు చేశారు.