సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల తొలగింపు

సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల తొలగింపు

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టి పెట్టిన ఆమె.. నియోజకవర్గాల పరిశీలకుల సమావేశాన్ని హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించారు. 2025, ఏప్రిల్ 23వ తేదీ జరిగిన ఈ సమావేశంలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకున్నది. 

సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పరిశీలకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పరిశీలకుల సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు మరో ఐదుగురు నేతలను పరిశీలకులుగా తొలగిస్తూ.. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 70 మంది పరిశీలకులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందగా.. హాజరుకాని వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదే సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారామె. పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించిన ఆమె.. 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు ఉండేలా చూడాలని స్పష్టం చేశారామె. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులు ఉండాలని స్పష్టం చేశారామె. 

Also Read:-హైడ్రా లోగో మారింది.. కొత్త లోగో ఇదే..!

పార్టీ మండల అధ్యక్షుడి ఎంపికు ఐదు పేర్లు సూచించాలని.. బ్లాక్ కాంగ్రెస్ కు ముగ్గురి సూచిస్తూ పీసీసీకి నివేదిక ఇవ్వాలని పరిశీలకులను ఆదేశించారు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరును పరిశీలకులు జాగ్రత్తగా గమనించాలని.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ పార్టీని పటిష్ఠం చేయాలని ఆదేశించారు మీనాక్షి నటరాజన్.