- వర్గాలను మోసం చేసిన మోదీ : షమా మహ్మద్
హైదరాబాద్, వెలుగు : దేశంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది కనుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహ్మద్ అన్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై వరకు 6,700 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేస్తారని పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ తెలంగాణ మీడియా కో ఆర్డినేటర్ సుజాతా పాల్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం
అన్యాయం చేసిందని ఆరోపించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ.. నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ‘‘పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. పాలు సహా అన్నింటిపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నరు. రైతులు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రశ్నించిన వ్యక్తులపై ఈడీ, ఐటీ రెయిడ్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నరు.
మహిళా రెజ్లర్లు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించినా చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని వర్గాల వారికీ అన్యాయం చేశారు’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరగాలని రాహుల్ న్యాయ్ యాత్ర చేస్తున్నారని, న్యాయ్ యాత్రతో దేశంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తారని చెప్పారు. బీజేపీని అధికారం నుంచిదింపుతారన్నారు.