వరంగల్, వెలుగు: ఉత్తుత్తి మేనిఫెస్టోతో సీఎం కేసీఆర్ మహిళలను మోసం చేస్తున్నాడని ఏఐసీసీ, ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి డాలీశర్మ విమర్శించారు. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్‌లో వెస్ట్ క్యాండిడేట్ నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఉమెన్ బ్యాంక్, ఉమెన్ ఇండస్ట్రీ కారిడార్, వెల్ఫేర్ బోర్డ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కేసీఆర్ కూతురు, ఎంపీ కవితకు లిక్కర్ స్కాములపై ఉన్న శ్రద్ధ మహిళలపై లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రియాజ్, లీడర్లు బంక సరళ సంపత్, రామకృష్ణ పాల్గొన్నారు.