ఇండియా కూటమిలో చేరండి : మల్లికార్జున ఖర్గే

ఇండియా కూటమిలో చేరండి : మల్లికార్జున ఖర్గే
  • కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
  • నైతికంగా మోదీ ఓడిపోయారని కామెంట్
  • రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు
  • ఎన్డీయేకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చామని వెల్లడి
  • ఐక్యంగా, సమన్వయంతో ముందుకెళ్లినట్లు వివరణ
  • బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోమన్న కాంగ్రెస్​ చీఫ్​

న్యూఢిల్లీ: ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయని తెలిపారు. నైతికంగా ప్రధాని మోదీ ఓడిపోయారన్నారు. కొత్త పార్టీల కోసం ఇండియా కూటమి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి నేతలంతా బుధవారం సాయంత్రం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. 

ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అపోజిషన్ పార్టీల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భేటీ ముగిసిన తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎంతో బాగా పోరాడాయి. అన్ని రాష్ట్రాల్లో ఐక్యంగా, సమన్వయంతో ముందుకెళ్లాయి. కూటమి నేతలందరూ క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇండియా కూటమిలోని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీజేపీ అవినీతి, అక్రమాలు, నియంతృత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి విజయం సాధించింది. 

రాజ్యాంగబద్ధంగా ఏకమై పోరాడటాన్ని మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. 2019తో పోలిస్తే కూటమితో పాటు కాంగ్రెస్​కు మంచి మెజారిటీ వచ్చిందని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నరు’’ అని ఖర్గే అన్నారు.

నైతిక విజయం కూటమిదే..

2019తో పోలిస్తే ఎన్డీయేకు సీట్లు భారీగా తగ్గాయని ఖర్గే అన్నారు. నైతిక విజయం ఇండియా కూటమిదే అని తెలిపారు. ‘‘రాజ్యాంగ బద్ధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం కలిసికట్టుగా పోరాటం చేశాం. మా కూటమికి దేశ ప్రజల నుంచి అఖండమైన మద్దతు లభించింది. కూటమి సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్వేషపూరిత, అవినీతి రాజకీయాలకు పాల్పడిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేసిన ఇండియా కూటమికే ప్రజలంతా ఓటేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తూనే ఉంటాం. బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూనే ఉంటాం’’ అని తెలిపారు. 

సరైన సమయంలో.. సరైన నిర్ణయాలు తీసుకున్నం

కూటమిగా బరిలోకి దిగిన కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఖర్గే తెలిపారు. దానికి గల కారణాలపై కూడా రెండు గంటల పాటు జరిగిన భేటీలో చర్చించినట్టు వివరించారు. దేశ రాజకీయ అంశాలపై కూడా చర్చించామని అన్నారు. చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో కూటమి నేతలు ఓడిపోయినట్టు వివరించారు. అభ్యర్థుల విజయంతో పాటు మోదీని ఓడించే విషయమై కూటమి సభ్యులంతా సరైన సమయంలో.. సరైన నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు.

భేటీకి ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ డుమ్మా

ఈ భేటీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వి, ఆప్‌ నేతలు సంజయ్‌, రాఘవ్‌ చద్దా, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత ఏచూరి, జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్​ అబ్దుల్లా హాజరయ్యారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ అటెండ్ కాలేదు. అయితే శివసేన (యూబీటీ) తరఫున పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. భేటీకి ముందు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని బలపరిస్తే తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు.