కరీంనగర్: టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రలో రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే స్పీకర్ ఆమోదించడంతో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు తీర్పునిస్తే... మధ్యలోనే రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
పొన్నం ప్రభాకర్ గారూ చేపడుతున్న పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ గారూ మరియు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు @INCIndia @INCTelangana#PonnamPadayatra pic.twitter.com/XGaz8SaNcb
— Ponnam Prabhakar (@PonnamLoksabha) August 16, 2022
మునుగోడు ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తూ వస్తున్నారన్న రోహిత్ చౌదరి... ఉప ఎన్నికలో కూడా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20 తర్వాత మునుగోడులో ఇంటింటికి వెళ్తామన్న ఆయన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల నాయకులు, స్థానిక నాయకులు చేపట్టిన పాదయాత్రలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును ప్రజలకు వివరించే అవకాశం కూడా దొరుకుతుందని రోహిత్ చౌదరి తెలిపారు.